బెంగాల్ రాజకీయ దాడులతో రగిలిపోతోంది. బీజేపీ, తృణమూల్ కార్యకర్తల ఘర్షణలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. దాడులు, హత్యలతో పరిస్థితి దారుణంగా మారిపోతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కత్తులు దూసుకుంటున్న బీజేపీ, తృణమూల్ పార్టీలు..ఇప్పుడు పరస్పర దాడులకు దిగుతున్నాయి. బెంగాల్లో శాంతి భద్రతలపై కేంద్ర హోంశాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇది అసలే ఉప్పు-నిప్పులా ఉన్న వ్యవహారం మరింత ముదరడానికి కారణం అవుతోంది.
బెంగాల్లో రాజకీయ యుద్ధం..! ప్రాణాలకు విలువేది..?
పదిరోజులుగా బెంగాల్ వ్యాప్తంగా ఈ రెండు పార్టీ నేతల మధ్య దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు మృతి చెందారు. ఓ చోట.. మరణించిన బీజేపీ కార్యకర్తలను తృణమూల్ కార్యాలయానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీలు వాగ్వాదానికి దిగారు. అక్కడే బీజేపీ కార్యకర్తల మృతదేహాలకు అంత్యక్రియలకు చేసి.. మరింత రెచ్చగొట్టారు. ఆ తర్వాత ఈ దాడుల వ్యవహారాన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. అమిత్ షాను కలిసి బెంగాల్లో పరిస్థితిని వివరించారు. దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు. మమతా సర్కార్‌కు హెచ్చరికల్లాంటి సూచనలు పంపారు.
రాష్ట్రపతి పాలన దిశగా కేంద్రం ఆలోచన..!?
అంతే కాదు.. బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసి బెంగాల్లో పరిస్థితిని వివరించారు. బెంగాల్లో ఘటనలపై కేంద్రానికి పూర్తి వివరాలు అందజేసినట్లు చెబుతున్నారు. మొత్తంగా పశ్చిమ బెంగాల్లో ఘటనలు.. ఢిల్లీ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా రాష్ట్రపతి పాలన లాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవాలనుకున్న గవర్నర్ సిఫార్సే కీలకంగా మారుతుంది. కేంద్రం అలాంటి ఆలోచన చేస్తోందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ మార్క్ రాజకీయంతోనే అసలు మంట..!
బీజేపీ పశ్చిమ బెంగాల్లో పట్టు నిలుపుకునేందుకు జై శ్రీరామ్ నినాదాన్ని వాడుకుంటున్నారు. తృణమల్ నేతలు … చివరికి మమతా బెనర్జీ ఎక్కడ కనిపించినా.. జై శ్రీరామ్ నినాదం చేస్తున్నారు. వారు ఆగ్రహిస్తే.. హిందువుల వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు ఘర్షణలకు కారణం అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లోనే ఉన్న ఘర్షణలు.. కొద్ది రోజులుగా.. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఇవే ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బెంగాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పాగా వేయాలనుకుటున్న బీజేపీ.. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి రావడంతో.. అడ్వాంటేజ్‌గా భావిస్తోంది. అశాంతికి అవే కారణాలని భావిస్తున్నారు.