కర్ణాటకలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దేశ రాజకీయాలను అనుకున్నట్లుగానే మలుపులు తిప్పుతోంది. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు బీజం పడింది. ఇప్పటికే.. బీజేపీ, మోదీని తీవ్రంగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ… కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చాయి. అయితే కూటమి రాజకీయాలపై చర్చల కోసం… చంద్రబాబు సహా.. వివిధ పార్టీల నేతలందరూ ఉదయానికే బెంగుళూరు చేరుకున్నారు. చంద్రబాబు కూడా ఉదయం పదిన్నరకల్లా బెంగళూరు చేరుకున్నారు. మమతా బెనర్జీ, మాయావతి, కేజ్రీవాల్ లాంటి వాళ్లతో సమావేశమయ్యారు. వారందరి మధ్య కూటమి చర్చలే జరిగాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు కూటమి అవసరం ఉందని.. ఆ దిశగా చొరవ తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బెంగాల్ సీఎం తృణమూల్ సూచించారు. మాయవతి, కేజ్రీవాల్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇతర ప్రాంతీయ పార్టీల అధినేతలతోనూ చర్చలు జరిగాయి.
బీజేపీతో విడిపోయిన తర్వాత ప్రాంతీయ పార్టీల అధినేతలను చంద్రబాబు తొలిసారి కలుసుకున్నారు. ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత ఉండాలన్నారు. రాష్ట్రాల హక్కుల కోసం అందరూ పోరాడాలని నిర్ణయించారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై ప్రాంతీయ పార్టీల అధినేతలకు చంద్రబాబు వివరించారు. ప్రాంతీయ పార్టీల నేతల చర్చల్లో పదిహేనో అర్థిక సంఘం విధివిధానాలపై కూడా చర్చ జరిగింది. అన్ని రాష్ట్రాల హక్కులను హరిస్తూ.. కేంద్రం చేతుల్లో కీల బొమ్మల్లా ఉండేలా… చూసుకుంటోందన్నారు. ఇది నిజమేనని బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు అంగీకరించారు. గతంలో జాతీయ కూటముల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించి ఉండటంతో.. ప్రాంతీయ పార్టీల నేతలంతా.. చంద్రబాబును కూటమి వైపు ప్రొత్సహిస్తున్నారు.
జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదంటున్నా… చంద్రబాబు.. బెంగుళూరులో బీజేపీ వ్యతిరేక కూటమి రాజకీయాలకు.. కొత్త రూపం తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ పొత్తు విషయం కన్నా.. అందరూ ఓ కూటమిగా ఏర్పడితే బాగుంటుదన్న అభిప్రాయం అన్ని పార్టీల నేతల్లోనూ వచ్చింది. దీనికి ఇప్పుడే బీజం పడింది. ఎన్నికల సమయానికి ఓ రూపం వచ్చే అవకాశం ఉంది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరు కాని ప్రధాన పార్టీల్లో టీఆర్ఎస్, ఒడిషా అధికార పార్టీ బీజేడీ ఉన్నాయి. ఈ రెండు బీజేపీతో రహస్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఎన్నికల తర్వాత పరిస్థితుల్ని బట్టి వీరి నిర్ణయాలుంటాయి. ఇప్పటికైతే.. విపక్షాలు ఏకం కాకూడదన్న బీజేపీ ప్రయత్నాలకు… చంద్రబాబు గండికొట్టినట్లయింది. ఇక అసలు “ఫ్రంట్” పాలిటిక్స్ హాట్ టాపిక్ కానున్నాయి.