జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చిత్రసీమని అస్సలు పట్టించుకోలేదు. కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు. చిరంజీవి దండం పెట్టినా – ప్రతినమస్కారం చేయని సంస్కార హీనుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఇండస్ట్రీ నుంచి ప్రతినిధులు తమ బాధల్ని చెప్పుకొందామని వెళ్తే, ఆయన చేసిన అగౌరవం ఎవ్వరూ మర్చిపోలేరు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజైతే, ఇండస్ట్రీ నుంచి ఎవ్వరికీ ఆహ్వానాలు అందలేదు. అందుకే చిత్రసీమలో చాలామంది ప్రభుత్వం మారాలని, మళ్లీ టీడీపీ రావాలని గట్టిగా కోరుకొన్నారు. అశ్వనీదత్ అయితే జగన్ ప్రభుత్వంపై తన అసహనాన్ని కాస్త గట్టిగానే బయట పెట్టారు. కొంతమంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు తెర వెనుక టీడీపీకి సాయం చేశారు.
సినిమావాళ్ల కల ఫలించింది. ఈసారి ప్రభుత్వం మారింది. టీడీపీ వచ్చింది. టీడీపీ హయాంలో చిత్రసీమకు దక్కిన గౌరవం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆరోజులు మళ్లీ మొదలయ్యాయి. రేపు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు చిత్రసీమలోని కొంతమంది ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవికి తొలి పిలుపు దక్కింది. రామ్ చరణ్ కూడా ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారు. సి.అశ్వనీదత్, రాజమౌళి, మురళీమోహన్ తదితరులకు కూడా ఆహ్వానం అందిందిందని సమాచారం. వీళ్లలో ఎవరు ఈ వేడుకకు హాజరు అవుతారో చూడాలి.
టీడీపీ రాకతో టాలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయన్న ఆనందం దర్శక నిర్మాతల్లో కలుగుతోంది. జగన్ హయంలో బెనిఫిట్ షోలు లేవు. ఇప్పుడు ఆ కళ చూడబోతున్నాం. ఈనెల 27న రానున్న ‘కల్కి’కి అర్థరాత్రి ఆటలకు అనుమతి వచ్చిందని తెలుస్తోంది. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న అవార్డుల్నీ అందిస్తే బాగుంటుంది.