తెలంగాణ మంత్రి కేటీఆర్ వర్కింగ్ స్టైల్, విజన్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయనకు ఇంతకు ముందు వివిధ అంతర్జాతీయ సంస్థలు.. తాము ఏర్పాటు చేసిన సదస్సుల్లో ప్రసంగించడానికి పిలిచాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక సదస్సుకు సైతం ఆహ్వానం లభిచింది సెప్టెంబర్ 14న జర్మనీలోని బెర్లిన్ నగరంలో నిర్వహించే గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయెన్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు.
శాస్త్ర, సాంకేతిక రంగ విధానం కోసం పనిచేస్తున్న ప్రపంచ నిపుణులతో కూడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. అధునాతన సాంకేతిక రంగాలకు సంబంధించి స్వదేశీ, విదేశీ పెట్టుబడుల సాధనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు, సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో డిజిటల్ టెక్నాలజీ విస్తరణపై ప్రజెంటేషన్ ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌కు ఐటీఐఎఫ్ ఉపాధ్యక్షుడు స్టీఫెన్ ఎజెల్ కోరారు. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక, వాణిజ్య, ఆవిష్కరణ సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడమే ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం.
ప్రాంతీయ ఆవిష్కరణల్లో పోటీతత్వం, జీవశాస్త్రాల ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన విధానాలు, డీకార్బనైజేషన్ను సులభతరం చేసే డిజిటల్ సాంకేతికతలు, ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో సుస్థిరత సాధించడం వంటి అంశాలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచలోని శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు చర్చల్లో పాల్గొంటారు. ప్రపంచంలోని ప్రముఖులు, నిపుణులు, వ్యాపార, ప్రభుత్వ, విద్య, విధాన రూపకల్పనకు సంబంధించి ఈ సదస్సుకు ఆహ్వానించారు. ఆ జాబితాలో కేటీఆర్ ఉన్నారు.