దాసరి దగ్గర సహాయ దర్శకుల గణం చాలా ఉండేది. యేళ్లకు ఏళ్లు, సినిమాలకు సినిమాలు.. ఆయన దగ్గరే ఉండేవారు. దాసరి కూడా సహాయకుల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవారు. వాళ్లపై ఈగ కూడా వాలనిచ్చేవారు కాదు. ఒక్కోసారి సహాయ దర్శకుల కోసం.. హీరోలనే ఎదిరించేవారు. అలాంటి ఓ అరుదైన సంఘటన ఇది.
‘దేవదాసు మళ్లీ పుట్టాడు’ షూటింగ్ జరుగుతోంది. అక్కినేని నాగేశ్వరరావు, జయప్రదల మీద ‘ఇది ఏమి పట్నమో బావ.. సూడబోతే రెండు కళ్లూ బోతున్నాయి’ అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. ఓ షాట్లో ఏఎన్నార్ చేతిలో కర్ర ఉంటుంది. ఆయన కర్ర పడేయడంతో షాట్ కట్ అవుతుంది. మరో షాట్ కి రెడీ అయినప్పుడు ఏఎన్నార్ చేతిలో కర్ర లేకుండానే కెమెరాముందుకు వచ్చారు. ‘సార్.. మీ చేతిలో ఇప్పుడు కర్ర ఉండాలి’ అని సహాయ దర్శకుడు రమణబాబు గుర్తు చేశారు. రమణ బాబు అంటే దాసరికి అత్యంత ఇష్టమైన సహాయకుడు. ‘అదేంటి.. ఇందాక పడేశాను కదా..’ అన్నారు ఏఎన్నార్. కానీ.. ఇది ఆ షాట్ కంటే ముందు తీయాల్సిన షాట్. కాబట్టి ఇందులో మీ చేతి కర్ర ఉండాల్సిందే` అన్నాడు రమణబాబు.
”లేదు.. ఈ షాట్లో అవసరం లేదు.. నాకు గుర్తుంది కదా” అనేది అక్కినేని వాదన.
`లేదు సార్.. సీన్ కంటిన్యుటీ నాకు తెలుసు కదా` అన్నది సహాయకుడి పట్టు.
ఇద్దరి వాదనా పెరిగింది.
”అంత నమ్మకంగా వాదిస్తున్నావు కదా. నీ వాదన తప్పని తేలితే నీ పారితోషికం వదులుకుంటావా” అంటూ అక్కినేని పందెం కాశారు.
ఈ తతంగం అంతా గమనిస్తున్న దాసరి.. మధ్యలోకి వచ్చి.. ”అక్కినేని గారూ.. మీరు సరదాగా అంటున్నారా, నిజంగానే పందెం కాస్తున్నారా” అని అడిగారు.
”లేదు. పందెమే.. తనకు తన మాట మీద చాలా నమ్మకం కదా, పందెం కాయమనండీ” అని రెట్టించారు అక్కినేని.
”సరే అయితే, ఆ పందెం న్యాయంగా ఉండాలి కదా. తను ఓడిపోతే.. పారితోషికం వదులుకుంటాడు. మీరు ఓడిపోతే మీ పారితోషికం ఇస్తారా” అని దాసరి అడిగే సరికి సెట్ సెట్ మొత్తం నిర్ఘాంత పోయింది.
”అంటే నా పారితోషికం, సహాయ దర్శకుడి పారితోషికం ఒకటే అంటారా” అంటూ కోపగించుకున్నారు అక్కినేని.
”కాకపోవొచ్చు. కానీ మీకు మీ పారితోషికం ఎంతో, సహాయ దర్శకుడికి తన పారితోషికం అంత. అయినా పందెం పదో, వందో అయితే ఫర్వాలేదు. ఏకంగా మీరు పారితోషికమే అడిగారు. అందుకే నేనూ అలా అనాల్సివచ్చింది” అని దాసరి వివరణ ఇచ్చారు.
కానీ అక్కినేని బెట్టు దిగలేదు. ”మీరంతా అంత నమ్మకంగా ఉంటే. పందానికి నేను రెడీ” అన్నారు.
ఆరోజుల్లో మానేటర్లు ఉండేవి కావు. ఏ చిన్న తప్పు జరిగినా రషెష్ చూసుకోవాల్సిందే. ఆ పాట పూర్తయిన వెంటనే చెన్నై పంపించి, ఫిల్మ్ డవలప్ చేయించారు. అన్నపూర్ణ ప్రివ్యూ థియేటర్లో పాట వేసుకుని చూసుకుంటే… సహాయ దర్శకుడు రమణ మాటే నిజం అని తేలింది. పాటంతా చూశాక అక్కినేని ”సారీ రమణ బాబు.. నువ్వు చెప్పిందే నిజం. నేనే పొరపడ్డాను” అని ఒప్పుకోవడంతో… ఈ గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటన… పలు సందర్భాల్లో దాసరి పాత్రికేయులతో పంచుకున్నారు. దాసరి సినిమాల నేపథ్యంలో వినాయకరావు రచించిన విశ్వవిజేత పుస్తకంలోనూ సవివరంగా ఉంది.