ఆడపిల్లంటే భారమని భావించే వారు ఎక్కువగా ఉన్న దేశం మనది. ఆడపిల్ల పుడితే అరిష్టం అనుకునే ఛాందసవాదులూ ఉన్నారు. ఆడపిల్ల డెలివరీ ఖర్చులు కూడా దండగే అనుకునే మూర్ఖులు కూడా ఉన్నారు. అయితే ఆడపిల్ల పుట్టడం ఆ ఇంటికి పండుగ అని చాటిచెప్తున్నారు ఈ మరాఠీ డాక్టర్.
మహారాష్ట్ర పుణేకు చెందిన డాక్టర్ గణేశ్ హడప్సార్ మెడికేర్ హాస్పిటల్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు. 25 పడకల ఆస్పత్రిని నడుపుతున్నారు. బేటీ బచావో, బేటీ పఢావో, అంటే ఆడపిల్లను రక్షిద్దాం ఆడపిల్లను చదివిద్దాం అనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు. అందుకే, తన ఆస్పత్రిలో డెలివరీ అయిన మహిళకు ఆడపిల్ల పుడితే ఫీజు తీసుకోరు. మగపిల్లాడు పుడితే ఫీజు తీసుకుంటారు. ఆడపిల్ల పుట్టడం అరిష్టం కాదు అదృష్టం అని చాటిచెప్పడమే ఆయన ఉద్దేశం.
పైగా ఆడపిల్ల పుట్టగానే ఆయన సొంత ఖర్చులతో ఆస్పత్రిలోని వారందరికీ స్వీట్లు పంచిపెడతారు. పుట్టిన బిడ్డను చక్కగా చూసుకోండని సూచన చేసి పంపుతారు. ఇలా ఇప్పటి వరకు ఆ ఆస్పత్రిలో 430 మంది ఆడపిల్లలు జన్మించారు. ఆడపిల్ల భారమని భావించే వారు ఆ ఆస్పత్రికి డెలివరీ కోసం వస్తుంటారు. ఆడపిల్ల పుడితే ఖర్చుండదు. అబ్బాయి పుడితే ఆనందమే. వారి ఆలోచన ధోరణి ఎలా ఉన్నా, తన ప్రయత్నం వల్ల ఆడపిల్లలను కాపాడాలని, సరిగ్గా పెంచుకోవాలనే భావన తల్లిదండ్రుల్లో కలుగుతుందని డాక్టర్ గణేశ్ ఆశిస్తున్నారు. ఆడపిల్లల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు.