బెట్టింగ్ యాప్స్ కేసును సిట్ కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ కు ఇవ్వడం అంటే దాన్ని పక్కన పెట్టేయడమే అన్న అభిప్రాయం గతంలో వేసిన సిట్లను బట్టి ఏర్పడుతోంది. నిజానికి బెట్టింగ్ కేసు డ్రగ్స్ కేసు లాంటిది కాదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది యూట్యూబర్లకు భారీగా ఆదాయం తెచ్చి పెట్టే మార్గం. చాలా మంది చేస్తున్నారు.. వారు చేయని నేరం తాము ఎందుకు చేస్తున్నామని ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ పోయారు. దానికి వారిని నేరస్తుల్ని చేయడం కష్టం. అసలు తప్పు బెట్టింగ్ యాప్ ఓనర్లది.
అసలు యాప్ ఓవర్లు ఎవరో తెలుసుకోలేకపోతున్నారా?
బెట్టింగ్ యాప్ ఓనర్లను అరెస్టు చేసే ప్రయత్నం చేయలేదా లేకపోతే… ఓనర్లు ఎవరో తెలుసుకోలేకపోతున్నారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇది టెక్నికల్‌గా జరిగే వ్యవహారం కాబట్టి ప్రతీది రికార్డు అవుతుంది. బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారికి డబ్బులు ఎవరు ఇచ్చారు.. అనే తీగను పట్టుకుని లాగితే ఓనర్ల వద్దకు పోవచ్చు. కానీ పోలీసులు అలా చేయలేకపోతున్నారు. వారికి ఏం కారణాలు అడ్డు పడుతున్నాయో ఎవరికీ తెలియదు కానీ.. చోటా సెలబ్రిటీలను సాక్షులుగా చేస్తామని లీకులు వచ్చి వారికి కాస్త రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
స్కిల్ గేమ్స్ పేరుతో బెట్టింగ్ యాప్స్‌కు కేంద్రం అనుమతులు
బెట్టింగ్ ను ముద్దుగా స్కిల్ గేమ్ అని పేరు మార్చుకుని కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకుంటున్నారు. విజయ్ దేవరకొండ తనపై కేసు నమోదు చేసినప్పుడు తన లీగల్ టీమ్ తో ఇవే ప్రకటన ఇప్పించారు. తాను లీగల్ గా అన్ని అనుమతులు ఉన్న కంపెనీకే ప్రచారం చేశానన్నారు. నిజానికి అందరూ అదే చేశారు. వారు తాము బెట్టింగ్ కోసం ప్రమోట్ చేయలేదని… స్కిల్ గేమ్స్ యాప్ కు ప్రమోషన్ చేశామని అంటున్నారు. ఈ పేరుతోనే వారు అనుమతులు తెచ్చుకుంటున్నారు.
ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్‌ల యాడ్సే
ఐపీఎల్ చూసేవారికి.. కొన్ని వందల బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో స్టార్ క్రికెటర్లు అంతా యాక్ట్ చేశారు. అవన్నీ బెట్టింగ్ యాప్‌లు కాదు. స్కిల్ గేమ్స్. చట్టానికి చిక్కకుండా.. ప్రభుత్వాలే వారికి అవకాశాలు కల్పించినప్పుడు.. ఇక చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులకు మాత్రం ఎక్కడ వెసులుబాటు దక్కుతుంది. తెలంగాణ ప్రభుత్వం చట్టం చేసి ఉండవచ్చు కానీ.. ఇలాంటివి ఓ ప్రాంతంలోనే నిషేధించడం అసాధ్యమైన పని.