కాదేదీ బెట్టింగ్ కి అనర్హం. కోళ్లు, క్రికెట్, రాజకీయాలు… అన్నింట్లోనూ బెట్టింగ్ రాయుళ్లు ఉంటారు. ఇప్పుడు వాళ్ల దృష్టి `మా` ఎన్నికలపై పడింది. రేపే `మా` ఎన్నికలు. ఈసారి కనీ వినీ ఎరుగని స్థాయిలో.. మా ఎన్నికలకు హైప్ వచ్చింది. ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య పోటీ రసవత్తరంగా సాగబోతోంది. వీళ్లలో గెలుపు ఎవరిదో చెప్పడం కష్టమే. ఎవరు గెలిచినా 50 ఓట్ల మెజార్టీకి మించి ఉండదు.
ఇప్పుడు గెలుపు విష్ణుదా? ప్రకాష్ రాజ్దా? అనే విషయంలో ఫిల్మ్నగర్లో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. నటీనటులు, దర్శకులు, కొంతమంది నిర్మాతలూ.. లోపాయకారిగా బెట్టింగ్ వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడు ఎవరన్న విషయంలో మాత్రమే కాదు. ఏ ప్యానల్ నుంచి ఎవరు గెలుస్తారు? అంటూ మిగిలిన వాళ్లపైనా బెట్టింగ్ మొదలెట్టేసినట్టు తెలుస్తోంది. ఈసారి ఓ ప్యానల్ నుంచి పోటీ చేస్తున్న ఓ సభ్యుడు తన గెలుపుపై అతి నమ్మకంతో… లక్షల కొద్దీ బెట్ వేసినట్టు ఫిల్మ్నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నిల సంగ్రామం మొదలైన రోజుల్లో ప్రకాష్ రాజ్ గెలుపు నల్లేరుపై నడక అనుకున్నారంతా. కానీ విష్ణు అనూహ్యంగా రేసులోకి వచ్చేశాడు. ఓ దశలో.. విష్ణు దే గెలుపు అనిపించింది. అయితే విష్ణు ప్యానల్ లో కొన్ని తప్పులు జరగడం, మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చి `ప్రకాష్ రాజ్ ని గెలిపిస్తా` అంటూ శపథం చేయడంతో… సమీకరణాలు మళ్లీ మారాయి.