క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే బెట్టింగులు వేయడం చూశాం. ఎలక్షన్లలోనూ.. బెట్టింగులు మొదలయ్యాయి. ఫలానా సినిమా హిట్టవుతుందా? అయితే ఎన్ని కోట్లు సాధిస్తుంది? అనే విషయంలోనూ బెట్టింగులు వేసుకుంటుంటారు. ఇప్పుడు కొత్త జూదం మొదలైంది. కరోనా కేసులపై బెట్టింగులు వేసుకుంటున్నార్ట. విచిత్రంగా ఉంది కదా?
కరోనా రోజురోజుకీ క్షణక్షణానికీ విజృంభిస్తోంది. కేసులు, మరణాల రేటు నానాటికీ పెరుగుతోంది. ఈ రోజు ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు నమోదు అవుతాయి? ఎన్ని మరణాలు సంభవిస్తాయి? అనే విషయాలపై బెట్టింగులతు మొదలయ్యాయి. ప్రతీ రాష్ట్రం ఓ హెల్త్ బులిటెన్ ని విడుదల చేస్తోంది. దాన్ని బట్టే.. బెట్టింగ్లో గెలిచిందెవరు? అనేది డిసైడ్ చేస్తున్నారు. ఎలాగూ క్రికెట్ మ్యాచ్లు లేవు. బెట్టింగు రాయుళ్లు, జూద శిఖామణులు ఖాళీగా ఉన్నారు. వాళ్లంతా కరోనా కేసులపై బెట్టింగులు కడుతూ కాలక్షేపం చేస్తున్నారిలా. కర్ణాటకలో ఈ తరహా బెట్టింగులు ఎక్కువ జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ అంటే భీమవరం గుర్తొస్తుంది. అక్కడ కూడా ఈ తరహా పందేలు ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది.