పందాల రాయుళ్లకు మళ్లీ చేతినిండా పని దొరికింది. ఎన్నికలు దగ్గర పడ్డాయి కదా? ఇప్పుడు గెలుపు గుర్రాలపై కోట్లు బెట్టింగులు వేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలలో ఈ బెట్టింగుల జోరు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈసారీ అంతే. ఏప్రిల్ 11న జరగబోతున్న ఎన్నికలలో గెలుపు ఎవరిది అనే దానిపై.. అక్కడ కోట్లకు కోట్లు బెట్టింగులు జరుగుతున్నాయి. అయితే ఈసారి బెట్టింగులకు కేంద్ర స్థానం ‘పవన్ కల్యాణ్’ అవ్వడం ఆకర్షించే అంశం. జనసేన పార్టీ స్థాపించి తొలిసారి పవన్ ప్రత్యక్ష రాజకీయాలలో దిగుతున్నాడు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పవన్ అభిమాన గణం, పవన్‌కి సంబంధించిన సామాజిక వర్గం అండదండలు జనసేనకు బలంగా ఉన్నాయి. వాటిపైనే పందాల రాయుళ్లు దృష్టి పెట్టారు. చిత్ర విచిత్రమైన బెట్టింగులతో… పవన్ ఫ్యాన్స్‌ని ఆకర్షిస్తున్నారు.
పవన్ కల్యాణ్ భీమవరంలో ఓడిపోతాడని కోట్లకు కోట్లు బెట్టింగులు జరుగుతున్నాయి. పవన్ అనేక సమీకరణాలు, లెక్కలు వేసుకుని భీమవరంలో పోటీకి దిగాడు. అయితే.. పవన్ ఈ నియోజక వర్గంలో ఓడిపోవడం తథ్యమని పందాల రాయుళ్ల నమ్మకం. దీనిపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. పవన్ గెలిస్తే.. లక్ష తీసుకోండి – ఓడిపోతే మూడు లక్షలు ఇవ్వండి అంటూ.. ఆకర్షిస్తున్నారు. గాజువాక నియోజక వర్గంలో పవన్ స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అందుకే అక్కడ బెట్టింగ్ సరళి మారింది. లక్షకి అయిదు లక్షల పందెంలో పవన్ దే ఫేవరెట్ ప్లేస్. అంటే పవన్ గెలిస్తే లక్ష తీసుకుంటారు. ఓడిపోతే.. 5 లక్షలు ఇవ్వాలన్నమాట. ఈ రెండు నియోజక వర్గాలలోనూ పవన్ గెలుస్తాడని కొందరు, రెండు చోట్లా పవన్ ఓడిపోతారని మరికొందరు బెట్టింగులు కడుతున్నారు.
గెలిస్తే ఎంత తేడాతో గెలుస్తాడు? ఓడిపోతే ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతాడు? అనే దానిపైనా బెట్టింగులు ఉన్నాయి. కానీ ఒకొక్కదానికీ ఒక్కో రేటు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పవన్ 6 సీట్ల కంటే ఎక్కువ గెలవడన్నది బెట్టింగు రాయుళ్ల నమ్మకం. దీనిపైనా బెట్టింగులు జరుగుతున్నాయి. రూపాయికి మూడు రూపాయల కోసు పందెం ఇది. అంటే పవన్ ఆరు స్థానాలు గెలుచుకుంటే లక్ష ఇస్తారు. ఆరు స్థానాలు గెలవకపోతే.. మూడు లక్షలు సమర్పించుకోవాలన్నమాట. నరసాపురం నియోజక వర్గం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న నాగబాబు కూడా బెట్టింగు రాయుళ్లని ఆకర్షిస్తున్నాడు. నాగబాబు ఓటమిపై భారీగా బెట్టింగులు మొదలయ్యాయి.
ఈ బెట్టింటు రాయుళ్లు ఓ సిండికేట్‌గా ఏర్పడి.. ప్రతీ నియోజకవర్గం, ప్రతీ ఊరూ తిరుగుతున్నారు. కొన్ని బెట్టింగులు ఫోన్ల ద్వారా జరిగిపోతున్నాయి. మధ్యవర్తుల ద్వారా డబ్బులు చేతులు మారుతున్నాయి. ఎన్నికలు పూర్తయ్యాక.. ఈ బెట్టింగులు మరింత ఉధృతంగా ఉంటాయని పరిశీలకుల అంచనా. ప్రతీసారీ బెట్టింగులు మామూలే అని, గతంలో కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇలానే పందాల రాయుళ్లు కోట్లకు కోట్లు పందాల రూపంలో పోగొట్టుకున్నారు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.