కాదేదీ బెట్టింగుకి అనర్హం. అది క్రికెట్ అయినా, ఎలక్షన్ అయినా. ఆఖరికి అవార్డులకీ.. ఈ బెట్టింగు గోల వదల్లేదు. రేపే… ఆస్కార్ అవార్డుల వేడుక. ఇది వరకు ఆస్కార్ అంటే.. మనవాళ్లు ఎలాగూ పట్టించుకొనేవారు కాదు. ఎందుకంటే.. మన సినిమాలేవీ ఆ స్థాయి వరకూ వెళ్లలేదు కాబట్టి. కానీ ఈసారి అలా కాదు. మన దేశం తరపున `నాటు నాటు` పాట ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతోంది. ఈ పాటకు ఆస్కార్ వస్తుందా? రాదా? అంటే ఉద్వేగంగా ఎదురు చూస్తోంది భారతావని. మన పాటకు దాదాపుగా ఆస్కార్ ఖాయమనే మాట వినిపిస్తోంది. ఇంకొన్ని గంటల్లో ఆస్కార్ మన చేతుల్లోకి వస్తుందా? రాదా? అనేది తేలిపోతుంది. ఈలోగా… టాలీవుడ్ లో జోరుగా బెట్టింగులు సైతం మొదలైపోయాయి. ఆస్కార్ నాటు నాటు పాటకు వస్తుందని ఓ నిర్మాత.. ఓ దర్శకుడితో పందెం కట్టాడని ఇన్ సైడ్ వర్గాల టాక్.ఆ పందెం వేలో, లక్షలో కాదు. ఏకంగా కోటి రూపాయలు. ఆస్కార్ వస్తుందని గట్టిగా నమ్మిన ఆ నిర్మాత… దర్శకుడికి కోసు పందెం ఇచ్చి మరీ.. బెట్ వేశాడని టాక్. టాలీవుడ్ లో ఇలాంటి పందాలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. పశ్చిమ గోదావరిలోని భీమవరం పందాలకు ఫేమస్. అక్కడ కోళ్ల పందాలే లక్షల్లో జరుగుతుంటాయి. అక్కడ కూడా.. ఆస్కార్ పై భారీగానే పందాలు వేశారని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఆస్కార్ `ఆర్.ఆర్.ఆర్` జాతకాన్నే కాదు… చాలామంది భవిష్యత్తుని డిసైడ్ చేయబోతోందన్నమాట. చూద్దాం.. ఏం జరుగుతుందో?