రాజధాని అమరావతిపై రెండో నివేదిక నేడు ప్రభుత్వానికి అందనుంది. బీసీజీ .. ప్రభుత్వ ఆలోచనలు తగ్గట్లుగానే నివేదిక ఇస్తుందని.. ఇప్పటికే అందరికీ అర్థమయిపోయింది. ప్రభుత్వం కూడా రాజధాని అమరావతిని విశాఖపట్నం తరలించేందుకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలను కొంతమంది అధికారులకు ఇచ్చింది. ఈ నివేదికపై జనవరి 8వ తేదీన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి అంతర్జాతీయ రేటింగ్ ఉన్న సంస్థతో నివేదిక తెప్పిస్తున్నామని ప్రకటించారు. బీసీజీ గ్రూప్ పై ఇప్పటికే అవినీతికి సంబంధించిన క్రిమినల్ కేసులు ఉన్న విషయం తెల్లవారే బయటపడింది. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి బీసీజీతో సంబంధాలున్నాయని టీడీపీ ఆరోపణలు ప్రారంభించింది.
ఈ ఆరోపణలతో బీసీజీ గ్రూప్ విశ్వసనీయతపై ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఈ కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇవ్వటంతో తుది నివేదిక కూడా అదే లైన్ లో ఉంటుందని తేల్చిచెబుతున్నారు. ఈ నివేదిక అందిన తర్వాత అటు జీఎన్ రావు కమిటీ, ఇటు బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే హైపవర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసేందుకు 15 రోజుల సమయాన్ని కూడా కేటాయించారు. బీసీజీ నివేదిక ప్రభుత్వానికి అందిన వెంటనే దీనిపై చర్చించేందుకు జనవరి 8వ తేదీన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారని సమాచారం అందింది.
అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, ప్రభుత్వ వర్గాలకు ఈ మేరకు సమాచారం అందింది. రెండు కమిటీల నివేదికలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఈ నెల 20వ తేదీలోపు నివేదిక ఇవ్వాల్సి ఉంది. హైపవర్ కమిటీ నివేదిక, రెండు కమిటీల రిపోర్ట్ లు, కేబినెట్ లో చర్చించిన అంశాలను జనవరి 20 లేదా రిపబ్లిక్ డే తర్వాత అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి చర్చించే అవకాశం ఉంది.