తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఏర్పడిన సన్నిహిత సంబంధాలుతో.. అద్భుతాలు జరగబోతున్నాయన్న సూచన కొన్నాళ్ల కిందట కనిపించింది. ఏపీ భవనాలన్నీ తెలంగాణకు ఇచ్చేయడం.. ఆ తర్వాత ఏపీ అక్రమ ప్రాజెక్టని వాదిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ముఖ్య అతిథిగావెళ్లబోతూండటంతో అది నిజమేననుకున్నారు. ఆ క్రమంలో.. ఏపీ ప్రయోజనాలకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. అదే భద్రాచలాన్ని ఏపీలో విలీనం చేయడం.
రాజ్ భవన్లో ఇచ్చిన ఇప్తార్ విందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ… ముఖాముఖి మాట్లాడుకున్న తర్వాత రెండు రాష్ట్రాలు… ప్రతిష్టాత్మకంగా కట్టుకుంటున్న ప్రాజెక్టులకు… ఎవరూ అడ్డం పడకూడదని.. ఓ మాటపూర్వక ఒప్పందానికి వచ్చారని ప్రచారం జరిగింది. దాని ప్రకారం… పోలవరం ప్రాజెక్ట్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు భద్రచలాన్ని… ఏపీలో కలిపేందుకు కేసీఆర్ అంగీకరించారని చెప్పుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఏపీ .. పోలవరం ప్రాజెక్ట్ పై తెలంగాణ.. అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పోలవరాన్ని నిలిపి వేయాలంటూ.. తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. దానికి ప్రధాన కారణంగా భద్రాచలం మునిగిపోతుందని… చూపించారు. ఈ కారణంగా… అటు కాళేశ్వరంపై ఏపీ అభ్యంతరాలు చెప్పకుండా.. ఇటు పోలవరానికి తెలంగాణ వైపు ఇబ్బందులు రాకుండా.. పరస్పర ప్రయోజనకరంగా… భద్రాచాలన్ని ఏపీకి ఇచ్చేస్తారనుకున్నారు. గవర్నర్ సమక్షంలోనే ఈ చర్చలు జరిగాయని.. మీడియాలో కూడా విస్తృత ప్రచారం జరిగింది.
ఇది సున్నితమైన విషయం. అలాంటి ఆలోచనే లేకపోతే.. ప్రభుత్వ వర్గాల నుంచి అప్పుడే ఖండన వచ్చేది. తెలంగాణ సర్కార్ నుంచి అలాంటి స్పందనేమీ లేకపోవడంతో నిజమేననుకున్నారు….అయితే.. తెలంగాణ ప్రభుత్వం హఠాత్తుగా.. ఈ అంశంపై స్పందించింది. తెలంగాణ ప్రభుత్వానికి అలాంటి ఆలోచనే లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. దాన్ని శరవేగంగా పూర్తి చేయాలని…ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ..భద్రాచలం ముంపు అనే గండం… ఆ ప్రాజెక్టుకు ఉంది. దానిపై అధ్యయనం చేయాలని తెలంగాణ కోర్టులో పిటిషన్లు వేసింది. ఒక వేళ కోర్టు …పోలవరం వల్ల భద్రాచలం ముంపు ప్రభావంపై.. అంచనా వేయాలని ఆదేశిస్తే… ప్రాజెక్ట్ పనులకు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే భద్రాచలం ఏపీకి ఇస్తే.. సమస్య పరిష్కారమవుతందనుకున్నారు. కానీ అలా పరిష్కారం అయ్యే సూచనలు లేవని స్పష్టమయింది.