ఈ దీపావళికి తెలుగు సినిమాల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. అనువాద చిత్రాలూ వస్తున్నాయి. కన్నడ నుంచి ‘బఘీర’ అనే సినిమా విడుదల అవుతోంది. కేజీఎఫ్, సలార్ లాంటి చిత్రాల్ని అందించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని రూపొందించింది. ప్రశాంత్ నీల్ ఈ కథ అందించడం విశేషం. ‘ఉగ్రం’ ఫేమ్ శ్రీమురళి హీరోగా నటించాడు. ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
శ్రీమురళికి కన్నడలో యాక్షన్ ఇమేజ్ ఉంది. దానికి తగిన కథ ఇది. దుర్మార్గుల్ని అంతం చేయడానికి దేవుడే రాక్షసుడిలా వచ్చాడు అనే డైలాగ్ ఈ ట్రైలర్ లో వినిపించింది. ఈ కథ సారాంశం కూడా అదే. హీరో పాత్రని రక్తం తాగే రాక్షసుడితో పోల్చారు. అతని విధ్వంసకాండ ఎలా సాగిందో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. యాక్షన్ కు పెద్ద పీట వేశారు. ట్రైలర్ అంతా అదే కనిపించింది. దుర్మార్గుల్ని అంతం చేయడానికి హీరో అదృశ్య రూపంలో రావడం, వాళ్లని ఏరి పారేయడం.. ఈ ఫార్మెట్ కథలు ఇది వరకు చాలానే వచ్చాయి. ‘బఘీర’ కూడా అంతే. కాకపోతే.. ఆ సెటప్ చూస్తుంటే కేజీఎఫ్, సలార్ సినిమాలు గుర్తుకొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ కథల్లో యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. అది ఈ కథలోనూ కనిపిస్తోంది. యాక్షన్ బ్లాక్స్ అదిరిపోయేలా డిజైన్ చేశారన్న నమ్మకం ట్రైలర్ ఇచ్చింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ప్రశాంత్ నీల్ పై ఉన్న ఇమేజ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కావొచ్చు. ‘సలార్’ కథకూ ‘ఉగ్రం’ కథకూ పోలికలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. దాంతో ప్రభాస్ అభిమానులు కన్నడ ‘ఉగ్రం’ సినిమాపై ఫోకస్ చేశారు. అలా.. మురళి పరిచయం అయ్యాడు. కాబట్టి.. ప్రభాస్ అభిమానులకు కొత్త హీరో అనే ఫీలింగ్ ఉండకపోవొచ్చు. అది మరో ప్లస్ పాయింట్.