పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు సీఎం కేసీఆర్ పాలన తెగ నచ్చేసింది. అదే పనిగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇటీవల రెండు సార్లు పర్యటించిన ఆయన మరోసారి .. తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. తెలంగాణ సచివాలయం ప్రారంభం వాయిదా పడింది. అయినప్పటికీ తన టూర్‌ను పంజాబ్ సీఎం వాయిదా వేసుకోలేదు. తెలంగాణలో అభివృద్ధి చూడాలని ఆయన డిసైడయ్యారు. ఆయనకు కేసీఆర్ స్వయంగా తెలంగాణలో తాను చేసిన అభివృద్ధిని చూపించబోతున్నారు.
సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ని తీసుకెళ్లనున్నారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్ లను చూపిస్తారు. పలు గ్రామాలతో పాటు కూడవెల్లి వాగు చెక్ డ్యామ్ ను చూపించి… తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చెందిందో వివరిస్తారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అవతరించినప్పటి నుంచి భగవంత్ మాన్ కేసీఆర్ తో పలు సార్లు భేటీ అయ్యారు. గత నెలలో ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు కూడా భగవంత్ మాన్ హాజరయ్యారు. తెలంగాణలోని కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శమని ప్రశంసలు కురిపించారు. పంజాబ్ లో కూడా కంటి వెలుగు తరహాలో పథకం ప్రారంభిస్తామని అన్నారు.
భగవంత్ మాన్ ఆప్ పార్టీకి చెందిన వారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పాలనపై దేశమొత్తం విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆయితే మాన్ మాత్రం… పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధికి ఫిదా అయిపోయారు. తెలంగాణ అభివృద్ధిని చూసి.. దేశానికి పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఆప్ నేతల్లోనూ ఆశ్చర్యానికి కారణం అవుతోంది.