Bhairava Geetha sameeksha
తెలుగు360 రేటింగ్ 2.5/5
ఓ చిన్న సినిమాకి విడుదలకు ముందే పబ్లిసిటీ దొరకడం, ‘ఇదేదో చూడాల్సిన సినిమాలా ఉందే’ అన్న వైబ్రేషన్ రావడం.. ఈ రోజుల్లో అదృష్టమనే చెప్పాలి. కోట్లు ఖర్చు పెడితే గానీ రాని పబ్లిసిటీ ఒకే ఒక్క మాటతో తెప్పించుకోవడంలో దిట్టైన రాంగోపాల్ వర్మ సినిమాలకు అలాంటి అదృష్టం అనుకోకుండానే వచ్చేస్తుంటుంది. ‘భైరవ గీత’ కూడా అలానే తనవైపు చూపు పడేలా చేసుకోగలిగింది. ‘భైరవ గీత’ కోసం వర్మ పదే పదే చెప్పడం, ట్రైలర్లలో వర్మ తాలుకు స్టైల్ నూటికి నూరుపాళ్లూ కనిపించడం బాగా కలిసొచ్చాయి. ‘ఆర్ ఎక్స్ 100’ తో ఏ సినిమా ఎప్పుడు ఆర్ డి ఎక్స్‌లా పేలుతుందో చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కలిసి ‘భైరవ గీత’ని చూడాల్సిన సినిమాల లిస్టులో చేర్చేశాయి. మరి ‘భైరవ గీత’ అంచనాల్ని అందుకుందా? వర్మ మైకు పట్టుకుని అరచి గీ పెట్టినంత విషయం.. ఈ సినిమాలో ఉందా??
కథ
అది రాయలసీమ. తన సహచరుల్ని కుక్కల కంటే హీనంగా చూసే సుబ్బారెడ్డి దగ్గర పనిచేస్తుంటాడు భైరవ (ధనుంజయ్). బానిసత్వాన్ని కూడా వారసత్వంలా భావించి – సుబ్బారెడ్డికి ఊడిగం చేస్తుంటాడు. పరువు కోసం ప్రాణాలిచ్చే సుబ్బారెడ్డి… తన కూతురు గీత (ఇరా మోర్) మంది – మార్బలంలో తనకంటే ఎక్కువ తూగే కట్టారెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. గీత మాత్రం భైరవని ఇష్టపడుతుంది. గీత తనని ఇష్టపడుతున్న విషయం భైరవకు తెలీదు. తన కూతురు భైరవ మాయలో పడిందని గ్రహించిన సుబ్బారెడ్డి – భైరవని చంపాలనుకుంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో భైరవ, గీత ఊరొదిలి పారిపోతారు. వీద్దరి కోసం గాలిస్తున్న సుబ్బారెడ్డి, కట్టారెడ్డి… భైరవ స్నేహితులతో పాటు, కన్నతల్లినీ హతమరుస్తారు. దాంతో పగతో రగిలిపోయిన భైరవ… సుబ్బారెడ్డిపై తిరుగుబాటు చేస్తాడు. ఆ పోరాటం ఎలా సాగిందన్నదే… భైరవ గీత.
విశ్లేషణ
ఈ సినిమా కథేమిటన్నది… ప్రారంభంలోనే వర్మ వాయిస్ ఓవర్ ద్వారా చెప్పేశాడు. రెండున్నర గంటల కథని నాలుగు వాక్యాల్లో ముగించి `ఈ కథలో గొప్ప విషయం ఏమీ లేద`న్న సంకేతాలు పంపేశాడు. కాకపోతే…. వర్మ శిష్యుడైన సిద్దార్థ్ ఈ కథని ఎలా తీస్తాడన్న ఆసక్తితో.. థియేటర్లో కూర్చుంటాం. అయితే ఆ ఆసక్తికీ, ఆశలకు ఏమాత్రం భంగం కలిగించలేదు సిద్దార్థ్. ప్రారంభ సన్నివేశాల్లోనే దర్శకుడి తాలుకూ ఇంటెన్సిటీ కనిపించింది. సుబ్బారెడ్డి, కట్టారెడ్డి పాత్రల్ని పరిచయం చేసిన విధానం చూస్తే… ‘భైరవ గీత’ ‘రా’ మెటీరియల్‌తో సాగే సినిమా అన్న విషయం అర్థమవుతుంది. రాయలసీమ అంటే.. కొండలూ, గుట్టలూ, రాళ్లూ, రాప్పలు. వాటి మధ్యే కెమెరాని అందంగా తిప్పుకొచ్చాడు దర్శకుడు. తన ఫ్రేమింగ్ చూస్తే ముచ్చటేస్తుంది. కానీ.. ఆ ఫ్రేమలో పట్టాల్సిన కథ మాత్రం ఇది కాదనిపిస్తుంది. చాలా సాదా సీదా అయిన కథని, అదే స్థాయి కథనంతో కాస్త విసుగు పుట్టిస్తాడు. నిజానికి.. భైరవని ప్రేమించేయాలన్నంత సీన్.. గీతకు ఎప్పుడు, ఎలా కలిగిందో తెలీదు. గీతని భైరవ ఎందుకు ప్రేమిస్తాడో తెలీదు. ప్రేమ పుట్టడానికి లాజిక్ లేకపోవొచ్చు. కాకపోతే… ఒకరి కోసం మరొకరరు చచ్చిపోయేంత ప్రేమ పుట్టాలి అన్నప్పుడు మాత్రం దానికి సరితూగే బలమైన కారణాల్ని పట్టుకోవాలి.
గీత – భైరవల లవ్ ట్రాక్ కూడా ఏమంత కొత్తగా అనిపించదు. చాలా సినిమాల్లో చూసిన రాజు – పేద కథే. ద్వితీయార్థంలో ఎమోషన్‌కి ఎక్కువ ఆస్కారం ఉంది. కన్నతల్లిని, స్నేహితుడ్ని క్రూరంగా చంపేస్తే… కథానాయకుడు ఎలా రియాక్ట్ అవుతాడు? ఏ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటాడు? అనేది ఉత్కంఠతని రేపేదే. కానీ… దాన్నీ సాదాసీదా కథనంతో నడిపించేశాడు. కత్తి పట్టుకుని.. దొరికినవాడ్ని దొరికినట్టు నరుక్కుంటూ పోవడంలో హింస తప్ప ఎమోషన్ కనిపించదు. `భైరవ గీత`లో కనిపించే లోపం అదే. పతాక సన్నివేశాల్లో ఈ నరుకుడు కార్యక్రమం వీర లెవిల్లో సాగుతుంది. గుంపులు గుంపులుగా కత్తులు పట్టుకుని పరిగెట్టడాలు, పొడుచుకోవడాలూ చూస్తుంటే.. ఎవరు ఎవరిని చంపుతున్నారో.. అందులో హీరో గ్యాంగ్ ఏదో, విలన్ గ్యాంగ్ ఏదో అర్థం కాదు. ప్రతినాయకుడిలో క్రూరత్వాన్ని చూపించడంలో చాలా మార్గాలుంటాయి. రక్తం లేకుండానే…. ఆ ఇంటెన్సిటీ చూపించడంలో వర్మ దిట్ట. కానీ… గునపాన్ని కింద నుంచి గుచ్చిన సన్నివేశం మరింత జుగుప్సగా అనిపిస్తుంది. రక్తం ఏరులై పారిన ఈ సినిమా… క్లాస్ ప్రేక్షకుల అభిరుచికి చాలా దూరంలో ఉంది. పాటలు తమ మానన వచ్చిపోతుంటాయి. హీరోయిన్ అంగాంగ సౌందర్యాన్ని చూపించుకోవడానికి ఓ పాట వాడుకున్నాడు దర్శకుడు.
నటీనటులు
నటీనటుల్ని వెదికి పట్టుకోవడంలో దిట్ట వర్మ. కొత్తవాళ్లయినా.. వర్మ పాత్రల్లో భలే ఇమిడిపోతారు. `భైరవ గీత`లోనూ అదే కనిపించింది. ధనుంజయ్ ది సింగిల్ ఎక్స్‌ప్రెషనే. కానీ ఈ సినిమాకి అది చాలు. కథానాయిక మరీ అందగత్తైం కాదు. అక్కడక్కడ శ్రియ పోలికలు కనిపిస్తాయి. లిప్ లాప్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. కథానాయిక తండ్రిగా కనిపించిన నటుడు అత్యంత సహజమైన క్రూతరత్వంతోనూ, కట్టారెడ్డి పాత్రధారి… శాడిజంతోనూ చెలరేగిపోయారు. మిగిలిన నటులంతా.. తమ పాత్ర మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం
టెక్నికల్ టీమ్‌లో ఎక్కువ మార్కులు వేయాల్సివస్తే… నిరభ్యంతరంగా కెమెరామెన్‌కి పడిపోతాయి. రాయలసీమలోని ‘రా’నీ ఏ స్థాయిలో చూపించాడో, అక్కడున్న సొగసునీ అలానే చూపించాడు. రాయలసీమలోని కొండలూ గుట్టల్ని ఇలా వాడుకోవచ్చా? అనిపించింది. సహజమైన లొకేషన్లలోనే చిత్రీకరణ జరపడం వల్ల.. సహజత్వం అబ్బింది. 1991 నాటి కథ ఇది. వాతావరణం కూడా అలాంటిదే ఎంచుకున్నారు. నేపథ్య సంగీతం కథ, సన్నివేశాల్లోని మూడ్‌ని మరింత ఎలివేట్ చేసింది. కథ ఎంపికలో దర్శకుడు పొరపాటు చేశాడు. అత్యంత సాదా సీదా కథని తీసుకున్నాడు. కథనంలోనూ మ్యాజిక్ లేదు. ఈ రెండు విషయాల్లోనూ దృష్టి పెడితే.. తప్పకుండా మంచి దర్శకుడిగా ఎదిగే నేర్పు ఉంది. ‘భయం కత్తి కంటే లోతుగా దిగుద్ది’ లాంటి మంచి డైలాగులు అక్కడక్కడ వినిపిస్తాయి.
తీర్పు
విడుదలకు ముందు ‘భైరవ గీత’ తెచ్చుకున్న అటెన్షన్ అంతా ఇంతా కాదు. ‘ఈ సినిమాని నాకంటే బాగా తీశాడు’ అని వర్మనే చాలా సందర్భాల్లో తన శిష్యుడ్ని వెనకేసుకొచ్చాడు. ఆమాట మాత్రం నిజం. ఫామ్ కోల్పోయి చాలాకాలమైన వర్మ చేతిలో ఈ కథని పెడితే.. మరో ‘ఆఫీసర్’ అయ్యేది. కానీ.. శిష్యుడు సిద్దార్థ్ మాత్రం దానికంటే పై స్థాయిలోనే ‘భైరవ గీత’ని మలిచాడు.
ఫైనల్ టచ్: రక్త చరిత్ర
తెలుగు360 రేటింగ్ 2.5/5