చిత్రసీమలో ప్రతిభ కంటే, పొందే ఫలితానికే విలువ. చేతిలో హిట్లు ఉన్నాయా, లేవా? అనేదే ఇక్కడి లెక్క. అది తప్పు కాదు కూడా. అందుకే ప్రతి ఒక్కరి దృష్టీ… హిట్టు బొమ్మ మీదే ఉంటుంది. అదొస్తే జాతకాలు మారిపోతాయి. అలా ఓ ముగ్గురు హీరోలు హిట్టు కోసం కలలు కంటున్నారు. ఈ ముగ్గురి జాతకాల్నీ ఒకే సినిమా డిసైడ్ చేయబోతోంది. అదే.. `భైరవం`.
బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి చేసిన సినిమా ఇది. తమిళంలో ‘గరుడన్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ సంక్రాంతికి విడుదల చేద్దామనుకొన్నారు. కానీ అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవ్వడంతో వాయిదా పడింది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. టీజర్ నిన్నే వచ్చింది.
బెల్లంకొండ చేతిలో 4 సినిమాలున్నాయి. ఆ సినిమాలకు కాస్తో కూస్తో బజ్ రావాలంటే.. భైరవంతో హిట్టు కొట్టాల్సిందే. ఎందుకంటే బెల్లంకొండ కూడా హిట్టు కొట్టి చాలా కాలమైంది. ‘రాక్షసుడు’ తరవాత సరైన సినిమా పడలేదు. ఇక నారా రోహిత్ మధ్యలో కాస్త గ్యాప్ తీసుకొని, ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ప్రతినిధి 2 రోహిత్ ని బాగా నిరాశ పరిచింది. ‘సుందరకాండ’ అనే పేరుతో ఓ సినిమా చేశాడు. అది బయటకు రావాల్సివుంది. తన కొత్త సినిమాలకు ఊపు, ఉత్సాహం రావడం భైరవం రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది.
ఇక మంచు మనోజ్‌ది మరో కథ. తను హీరోగా బాగా డల్ అయ్యాడు. ఓ దశలో సినిమాలకు గుడ్ బై చెబుదామనుకొన్నాడు. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల్లో పడింది. పెళ్లి చేసుకొని – కాస్త సెటిల్ అవుతున్నాడనుకొంటే, ఇంటి వ్యవహారాలు బయటకు వచ్చి, బాగా నలిగిపోయాడు. ఇప్పుడు విలన్‌గా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. తన సెకండ్ ఇన్నింగ్స్ కి ఓరకమైన జోష్ కావాలి. అది ‘భైరవం’ ద్వారా రావాలని కోరుకొంటున్నాడు. చాలా రోజుల తరవాత మనోజ్ చేసిన సినిమా కాబట్టి, ఈ పాత్ర ఎలా ఉండబోతోంది అనే కోణంలో ప్రేక్షకులు ఆసక్తి చూపించడం సహజం. ఇది వరకటి జోష్ తనలో ఉందా, లేదా? అనేది ఈ సినిమాతో అంచనా వేస్తారు. భవిష్యత్తులో మనోజ్ నటించే మిగిలిన సినిమాల బజ్ కూడా ఈ సినిమా ఫలితంతో ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు.