2015లో వచ్చిన భజరంగీ భాయ్‌జాన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అటు వసూళ్లు, ఇటు విమర్శకుల మెచ్చుకోళ్లూ… రెండూ ఈ సినిమాకి దక్కాయి. సరిగ్గా అదే సమయంలో బాహుబలి వచ్చింది. ఈ రెండింటికీ కథ అందించింది విజయేంద్ర ప్రసాద్. ఒకేసారి ఇండియాలోనే రెండు బిగ్గెస్ట్ హిట్స్ చిత్రాలకు కథల్ని అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. బాహుబలి 1 తరవాత బాహుబలి 2 వచ్చింది. అలానే భజరంగీ భాయ్ జాన్‌కి సీక్వెల్ కూడా చేయాలన్న ఓ ఆలోచన ఉంది. గత రెండేళ్లుగా విజయేంద్ర ప్రసాద్ ఈ కథపై వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ కథ పూర్తి చేశారని సమాచారం. ఆమధ్య భజరంగీ భాయ్ జాన్ 2 ఐడియాని సల్మాన్ ఖాన్ తో పంచుకున్నార్ట… విజయేంద్ర ప్రసాద్. సల్మాన్ ఖాన్ కూడా ఈ సీక్వెల్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకుడు. సీక్వెల్ కూడా ఆయనే తెరకెక్కిస్తాడా? లేదంటే మరో దర్శకుడు రంగ ప్రవేశం చేస్తాడా? అనేది చూడాలి. 1987లో చిరంజీవి `పసివాడి ప్రాణం` అనే సినిమా వచ్చింది. ఓ మూగ పిల్లాడు హీరోకి దొరకడం, ఆ పిల్లాడ్ని… హీరో కాపాడడం.. ఇదే కథ. విజయేంద్ర ప్రసాద్ ఈ కథని స్ఫూర్తిగా తీసుకునే, భజరంగీ భాయ్ జాన్ కథ రాశారు. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు కూడా. మరి పార్ట్ 2 కి ఏ కథ స్ఫూర్తినిచ్చిందో…?