https://www.youtube.com/watch?v=HdbD5Kc_4CU
కావల్సినంత టాలెంట్ ఉండి, కాస్త అదృష్టం కరువైన హీరోల్లో కార్తికేయ ఒకడు. ‘ఆర్.ఎక్స్.100’తో ఆర్డీఎస్ బాంబులా పేలాడు. ఆ తరవాత వెరైటీ కథల్ని ఎంచుకొన్నా, ఎందుకో అదృష్టం కలసి రాలేదు. మలి హిట్ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నాడు. తన నుంచి వస్తున్న మరో సినిమా ‘భజే వాయు వేగం’. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం, టైటిల్ లో పాజిటీవ్నెస్ ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చాయి. పైగా ఈసారి రెగ్యులర్ యాక్షన్ డ్రామాకాకుండా ఓ థ్రిల్లర్ ఎంచుకొన్నాడు కార్తికేయ. టీజర్ తో ఆ విషయం అర్థమైంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. 2 నిమిషాల నిడివిగల ట్రైలర్ ఇది. రేసీగా సాగిపోయింది. ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథ ఇది. ఆ బ్యాగులో ఏముంది? ఆ బ్యాగ్ కోసం హీరో చుట్టూ ఎంత మంది పడ్డారు? అనేది ‘భజే వాయు వేగం’ కథ.
ఎంతటి స్క్రీన్ ప్లే మ్యాజిక్, థ్రిల్లర్ సినిమాలకైనా ఎమోషన్ చాలా అవసరం. దాన్ని తండ్రి పాత్ర (తనికెళ్ల భరణి)తో తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తండ్రి ఎమోషన్ ప్రేక్షకుల్ని కట్టిపడేసే అవకాశం ఉంది. విజువల్స్ లో క్వాలిటీ కనిపిస్తోంది. తారాబలం కూడా బాగానే ఉంది. లవ్ స్టోరీకి స్కోప్ తక్కువ. అందుకే వాటిపై ట్రైలర్లోనూ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ట్రైలర్ చూస్తే, సినిమాలో ఏదో విషయం ఉందన్న సంగతి అర్థమవుతోంది. ఈనెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి… ఈసారైనా కార్తికేయకు లక్ కలిసొస్తుందేమో చూడాలి.