విష్ణువు 21(ఎకవింశతి)అవతారాలు (పార్ట్ 1)
ఈ మొదటి భాగంలో….
– శ్రీకృష్ణుడు ఎన్నో ఆవతారం ?
– ఎన్నో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని అవతారిక జరిగింది?
– వరాహ అవతారంలో విష్ణువు భూమిని ఎందుకు రక్షించాల్సి వచ్చింది ?
– హిరణ్యాక్షుడు ఖగోళ శాస్త్రవేత్తా ?
– భూమిపై హిరణ్యాక్షునికి ఎందుకంత కసి? ..ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ భాగంలో చదవండి.
ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడైన పరమ పురుష (శక్తి) ఒక్కటే. ఆ శక్తి నుంచే సత్వరజస్తమో గుణాలను స్వీకరించి త్రిమూర్తులు (హరి, బ్రహ్మ, రుద్రుడు) అవతరించారు. వీరే ఈ లోకాలను సృష్టిస్తూ రక్షిస్తూ, అంతం చేస్తుంటారని భాగవతం చెబుతున్నది. ఈ ముగ్గురిలో సత్వగుణ సంపన్నుడైన శ్రీహరి (మహా విష్ణువు) తనలోని అనంత మహాశక్తితో చరాచర ప్రపంచానికి అపారమైన శుభాలను కలిగిస్తుంటాడని పెద్దలు చెబుతుంటారు. ఈ పరమాత్ముడైన మహావిష్ణువు యోగనిద్రా ముద్రితుడై మహాసముద్రం (దీన్నే పాలకడలిగా చెబుతుంటారు)మధ్యలో శయనించి ఉంటాడు. ఇక్కడ సముద్రమంటే నీళ్లు అని కాదు. పాలనికాదు. విశ్వవిశ్వాంతరాల్లో అనంత శూన్యం ఆవరించిఉంది. ఇదంతా వాయుసమ్మేళనం. ఇదే మహాసముద్రంలా కానవస్తుంది. అలాంటి సముద్రంమీద యోగనిద్రా ముద్రితుడైఉన్న ఈ రూపాన్నే మూలవిరాట్టయిన ఆదినారాయుణుని దివ్యరూపంగా చెబుతుంటారు. దేవదేవుని నాభి నుంచి కమలం పుట్టింది. అందులోనుంచి సృష్టికర్తల్లో ఒకరైన బ్రహ్మ ఆవిర్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాల నుంచే ఈ సమస్త లోకాలు పుట్టుకొచ్చాయి.
మహావిష్ణువు 21 అవతారాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. (వీటిలో పది అవతారాలను – దశావతారాలుగా ప్రసిద్ధి చెందాయి) . ఈ 21 అవతారాలలో 20వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణునిగా జన్మించారు. చాలా చిత్రమైన విషయం ఏమంటే అప్పటికే 27 ద్వాపరాలు వెళ్ళిపోయాయి. 28వ ద్వాపర యుగంలో శ్రీ కృష్ణావతారం చోటుచేసుకోవడం.
మహాకాల చక్రంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా,ద్వాపర, కలియుగాలు) బండిచక్రపు ఆకులవలె పైకిక్రిందకు తిరగాడుతుంటాయి. ఈ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు నడుస్తున్నది 28వ కలియుగంగా చెప్పుకోవచ్చు. ఇక విష్ణువు అవతార క్రమంలోకి వెళదాం.
1. దేవదేవుడు నలుగురు పిల్లలుగా ఈ తొలి అవతారంలో కనిపించారని భాగవతం ప్రధమ స్కంధంలో ప్రస్తావించబడింది. కౌమార దశలో ఉండే ఈ పిల్లలు – సనక, సనంద, సనాతన, సనత్కుమారులుగా పిలవబడేవారు. మహర్షుల రూపంలో ఉంటూ వీరు కఠోరమైన బ్రహ్మచర్యం ఆచరిస్తూ చరించారు. వారు వేరు, మహావిష్ణువు వేరుకారు. అందుకే వారు నిరభ్యంతరంగా తాము కోరుకున్నప్పుడల్లా వైకుంఠానికి వెళ్లేవారు. అలా ఒక సారి వెళ్ళినప్పుడే
జయ,విజయులనే ద్వారపాలకులు అడ్డగించడం, ఈ మునుల శాపానికి గురవడం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న మహావిష్ణువు తన ప్రతిరూపాలైన మునులను శాంతింపజేస్తారు. ఈ శాప ఫలితంగానే ద్వారపాలకులు భూమిమీద రాక్షసులుగా పుడతారు. మొదటి జన్మంలో వీరు హిరణ్యకశిపు, హిరణ్యాక్షలుగా జన్మిస్తారు. సనకాది కౌమార మునుల ప్రస్తావన మనకు చందోగ్య ఉపనిషత్ లో కనిపిస్తుంది. ఈ ఉపనిషత్ లోని ఏడవ అధ్యాయంలో సనక,ననందాదుల వద్ద అనేకులు సర్వ శాస్త్రాలు అభ్యసించారు. నారాయణ కవచంలో కూడా ఈ కౌమార మహర్షుల ప్రస్తావన ఉంది. లేత వయసులోనే సర్వశాస్త్రాలు అభ్యసించి వీరు మహర్షులుగా ఎదిగారు. వీరి శాపం కారణంగానే మహా విష్ణువు తన తర్వాతి అవతారం ఎత్తవలసి వస్తుంది.
2. విష్ణువు రెండవ అవతారంగా యజ్ఞ వరాహ అవతారం దాల్చాడు. హిరణ్యాక్షుడ్ని వధించి భూమిని రక్షిస్తాడని భాగవతంలో ప్రస్తావించబడింది. వరాహ అవతారం గురించి అనేక కథలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. వాటినన్నింటినీ హేతుబద్దంగా తీసుకుంటే వరాహ అవతార విశిష్టతను ఇలా అర్థం చేసుకోవచ్చు.
విష్ణువు రెండవ అవతారం ఎత్తే సమయానికి ఈ భూమండలంమీద సృష్టి ప్రారంభం కాలేదు. సూర్యమండలం నుంచి విడివడిన ఈ గ్రహం ఇంకా చల్లారలేదు. అనేక వాయువుల సమ్మేళనంతో దట్టమైన పొగ ఆవరించబడి ఉంది. ఇవేవీ జీవరాశిని సృష్టించడానికి పనికొచ్చేవి కావు. ఇలా చదువుతున్న మీకు ఈపాటికే ఒక సందేహం కలిగిఉండవచ్చు. విష్ణువు తొలి అవతారమైన సనకాది కౌమార మునులు మరి ఎక్కడ పెరిగారు ? వారు ఎవరికి సర్వశాస్త్రాలు నేర్పారు? ఈ అనంత విశ్వంలో కేవలం భూమిమీదనే ప్రాణం ఉన్నదని భ్రమించడం తప్పు. విశ్వంలో అనేక చోట్ల జీవరాశి విరాజిల్లుతున్నదన్న సత్యం గ్రహించాలి. ఇప్పటి శాస్త్రవేత్తలు సైతం దీన్ని అంగీకరిస్తున్నారు. మన సౌర కుటుంబాన్ని పోలిన కుటుంబాలు అనేకం ఈ విశ్వంలో తిరగాడుతున్నాయి. యుగాలు కాలచక్రంలో తిరగాడుతున్నట్టుగానే ఈ గ్రహాల పుట్టుక, మనుగడ, నశింపులన్నీ క్రమపద్ధతిన జరిగిపోతుంటాయి. కనుక, ఈ భూమిలాంటి గ్రహాలు అనేకం అప్పటికే పెరిగి క్రమాభివృద్ధి చెందిఉండవచ్చు. వాటిలో జీవరాశి ఉండిఉండవచ్చు.
ఇక మళ్ళీ వరాహ అవతారం నాటి భూమి దగ్గరకు వద్దాం. అప్పకది ఇంకా చల్లారని గ్రహం. ప్రాణవాయువు లేని గ్రహం. ఇలాంటి గ్రహంపై తన ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించాడు హిరణ్యాక్షుడు. తర్కపరంగా చూస్తే, హిరణ్యాక్షుడు ఒక ఖగోళ శాస్త్రవేత్త కావచ్చు. అతని సోదరుడు హిరణ్యకశిపుడు మహా బలసంపన్నుడు. వీరంతా భూమినిపోలిన వేరే గ్రహంలో ఉంటున్నారు. ఆనాటి శాస్త్ర పరిశోధనల ప్రకారం హిరణ్యాక్షుడు ఈ భూమిపై పెను ప్రయోగం చేపట్టాడు. భూమిని వేరే కక్ష్యలో ప్రవేశపెట్టడమే అతగాడి ధ్యేయం. అదే జరిగితే, అప్పుడప్పుడే ప్రాణవాయువు ఆవిర్భవించే అవకాశం ఉన్న తరుణంలో ఈ ప్రయోగంతో పరిస్థితులు తారుమారు అవుతాయి. జగత్తును సృష్టించే ఆదినారాయణ దేవుని సంకల్పానికి ఇది విరుద్ధం. ఖగోళ శాస్త్రవేత్త అయిన హిరణ్యాక్షుడు తన ప్రయోగ `బలం’తో భూమిని వేరే కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రయత్నం ప్రారంభించాడు. రసాయన శాస్త్ర ప్రకారం ఇలా కక్ష్య మార్చి, శూన్యరాశి (దీన్నే సముద్రంగా అభివర్ణించుకున్నారు)లోకి త్రోసేస్తే రసాయన సమీకరణల్లో మార్పులు వచ్చి, సృష్టికి అవసరమైన ప్రాణవాయువు లభించే పరిస్థితి ఉండదు. అప్పుడిక సృష్టే ఉండదు. అందుకే విష్ణవు హుటాహుటిన బ్రహ్మ యెక్క నాసికా రంధ్రం నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన వారహా రూపంలో వెలువడి విశ్వంలోకి దూసుకుపోయాడు. వెంటనే బ్రహ్మాండమంత ఎత్తుకు ఎదిగాడు. అదుపుతప్పిన భూమిని తిరిగి సరైన కక్ష్యలో ఉంచారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. వాయుసమీకరణలు వేగవంతంగా సాగాయి. ప్రాణవాయువు పుట్టుకొచ్చింది. అక్కడి నుంచి ఏకకణజీవుల ఆవిర్భావం, ఆపైన జీవపరిణామక్రమం చోటుచేసుకుంది. నరావతారం సాఫీగా సాగిపోయింది.
హిరణ్యాక్షునికి మన భూమి అంటే ఎందుకంత కోపం ? ఒక గ్రహం సర్వసంపన్నవంతంగా విరాజిల్లుతుంటే అక్కడి గ్రహవాసులు వేరే గ్రహం అదేతీరున అభివృద్ధి చెందడాన్ని సహించలేరు. అందునా హిరణ్యాక్ష, హిరణ్యకశుపులు వంటి రాక్షస ప్రవృత్తి ఉన్నవారు అసలే సహించలేరు. దీంతో గ్రహాంతర యుద్ధాలు తప్పవు (స్టార్ వార్ సినిమాలో లాగా). ఇలాంటి పరిస్థితి వస్తే సమస్త లోకాలను ఆవిర్భవించిన మహావిష్ణువు ఎందుకని ఊరుకుంటాడు. ఆయన ఎలా నిశ్చింతగా యోగనిద్రా ముద్రలో ఉండగలరు. అందుకే హుటాహుటిన వరాహ అవతారం దాల్చారు. పరిస్థితిని చక్కదిద్ది, భూమిమీద సర్వ జీవుల పుట్టకకు అనుకూలమైన వాతావరణం చెడకుండా చూశారు. మహా విష్ణువు ఆరోజు అలా చేయకపోతే భూమి మీద జీవరాశి పుట్టేదే కాదు. ఈ కృతజ్ఞతా భావంతోనే భూమిని రక్షించిన దేవదేవుడ్ని నిత్యం ఆరాధిస్తుంటాము. ఈ ఆరాధన అనంత ప్రవాహం. ఈ పర్వదినం, ఆ పర్వదినమని ఉండదు. ప్రతి రోజూ, ప్రతి క్షణం మహా విష్ణువుని స్మరించుకోవాల్సిందే. అనేక రకాల ప్రమాదాలు భూమికి పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అనివార్యం.
(మిగతాది రెండవ భాగంలో.. )
– కణ్వస