bhala thandanana review
తెలుగు360 రేటింగ్ 2.5/5
తొలి చిత్రం `బాణం`తోనే తనదైన ముద్ర వేశాడు చైతన్య దంతులూరి. ఆ సినిమాని ఓ సీరియస్ డ్రామాగా ఎంతో ఇంటెన్సిటీతో నడిపిన విధానానికి అప్పట్లో మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆయన రెండో చిత్రం `బసంతి` ఆడలేదు. అక్కడ బ్రేక్ పడింది చైతన్య కెరీర్‌కి. మళ్లీ చాలా రోజుల తర్వాత `భళా తందనాన` అంటూ శ్రీవిష్ణుతో జట్టు కట్టాడు. కొత్త కథలతో ప్రయాణం చేసే శ్రీవిష్ణు ఒకపక్క… వారాహి చలన చిత్రం నిర్మాణం మరోపక్క… చైతన్య దంతులూరి దర్శకత్వం… ఇలా ఈ కలయిక ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిచ్చింది. ప్రచార చిత్రాలు కూడా కాసిన్ని అంచనాలు పెంచాయి. మరి సినిమా అంతే ఆసక్తిగా సాగిందా?
శశిరేఖ (కేథరిన్) ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. ఎవ్వరికీ భయపడని తత్వం. ఆమెతో ఓ అనాథాశ్రమంలో పనిచేసే చందు అలియాస్ చంద్రశేఖర్ (శ్రీవిష్ణు) ప్రేమలో పడతాడు. ఇంతలో వరుస హత్యలు చోటు చేసుకుంటాయి. వాటిని పరిశోధించడం కోసం శశిరేఖ రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో చందు… చనిపోయినవాళ్లని తాను చూశానని చెబుతాడు. చందు సాయంతో ఆ కేసు లోతుల్లోకి వెళ్లిన శశిరేఖకి ఎలాంటి విషయాలు తెలిశాయి? వరుస హత్యలు ఎవరు చేస్తున్నారు? 2 వేల కోట్ల హవాలా డబ్బుకీ, చందుకీ సంబంధం ఏమిటనే విషయాలతో సినిమా సాగుతుంది.
కిడ్నాప్ డ్రామాతో ఆసక్తికరంగానే సినిమాని మొదలు పెట్టాడు దర్శకుడు. ఆ తర్వాత నాయకానాయికల జీవితాల్ని పరిచయం చేస్తూ పోవడంతో అసలు కథలు మొదలవ్వడానికి దాదాపు అరగంట సమయం పడుతుంది. వరుస హత్యలు చోటు చేసుకోవడం, వాటి పరిశోధన కోసం శశిరేఖ రంగంలోకి దిగడంతో కథలో వేగం పుంజుకుంటుంది. అప్పటికే శశిరేఖ ప్రేమలో పడిపోయిన చందుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వల్ ట్విస్ట్ కథా గమనాన్నే మార్చేస్తుంది. కథలో అప్పటిదాకా లేని మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది.
ద్వితీయార్థం మొత్తం 2 వేల కోట్ల డబ్బు దోపిడీ చుట్టూనే సాగుతుంది. అత్యంత క్రూరుడైన ఆనంద్ బాలి ఆధీనంలో ఉన్న 2 వేల కోట్లు దోపిడీకి గురికావడం, ఆ డబ్బు కోసం రెండు ముఠాలు అన్వేషించడం, ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు రక్తి కట్టిస్తాయి. స్టోరీ ప్లాట్ ఆసక్తికరంగానే అనిపించినా దాన్ని కలగూరగంపలా మార్చేయడమే సినిమాకి మైనస్‌గా మారింది. ప్రతీ కథకి ఓ టార్గెట్ ఆడియెన్స్ ఉంటారు. కానీ ఈ కథ అందరికీ నచ్చాలనే ప్రయత్నంతో అందులో హ్యూమర్, లవ్ వంటి అంశాల్ని జోడించారు. అవన్నీ క్రైమ్ థ్రిల్లర్ కథల్లో ఇమడని అంశాలని కథ ముందుకు సాగేకొద్దీ అర్థమవుతుంది. ప్రేమ అన్నాక పాటలు కూడా ఉంటాయి కదా. అవన్నీ ఈ కథా వేగానికి బ్రేక్‌లు వేశాయి. కథలో కావల్సిననన్ని మలుపులున్నా అవి ప్రేక్షులకు పెద్దగా కిక్‌నివ్వవు. ఇన్వెస్టిగేషన్, క్రైమ్ వంటి అంశాలు కథలో ఉన్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠని పెంచాలి తప్ప, మధ్యలో కామెడీ సన్నివేశాలు, నాయకానాయికల మధ్య పాటల్ని చొప్పిస్తే ఇంటెన్సిటీ మాయమై సన్నివేశాలు చప్పగా మారిపోతాయి. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. అటూ ఇటూ కాకుండా ఓ మంచి కథ రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది. కథలో కొన్ని విషయాల్ని బయట పెట్టకుండా రెండో భాగం కూడా ఉందంటూ చివర్లో ప్రకటించింది చిత్రబృందం.
శ్రీవిష్ణు నటుడిగా ఎప్పుడూ తన పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేస్తాడు. ఈసారీ అంతే. తన నటనతో ఆకట్టుకున్నాడు. అమాయకమైన కుర్రాడిగా కనిపిస్తూ పాత్రలో ఒదిగిపోయిన తీరు మెప్పిస్తుంది. విరామం తర్వాత ఆయన నటనలోని యాక్షన్ కోణం ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతుంది. కేథరిన్ జర్నలిస్ట్ పాత్రలో మంచి అభినయం ప్రదర్శించారు. కానీ ఆమె డబ్బింగ్ ఇబ్బంది పెడుతుంది. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలన్న ఆలోచన మంచిదే కానీ, ఆ గొంతు సహజత్వాన్ని దెబ్బతీసేలా ఉందనుకున్నప్పుడు ఆ ప్రయత్నం విరమించుకోవాల్సిందే. ఆనంద్ బాలిగా కేజీఎఫ్ నటుడు రామచంద్రరాజు, ఆనందమయంగా పోసాని పాత్రల్లో ఒదిగిపోయారు. సత్య, శ్రీనివాస్‌రెడ్డి అక్కడక్కడా నవ్విస్తారు. మిగిలిన పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు.
టెక్నికల్ విభాగాలు చక్కటి పనితీరునే కనబరిచాయి. మణిశర్మ సంగీతం బాగుంది. కెమెరాపనితనం కూడా మెప్పిస్తుంది. శ్రీకాంత్ విస్సా రచనలో బలం, కొత్తదనం కనిపించినప్పటికీ అవి సినిమాకి చాలలేదు. ఓ జోడీ, మధ్యలో ప్రేమ, పాటలు, మధ్యలో కామెడీ, ఇంటర్వెల్లో ఓ ట్విస్ట్, ఆకట్టుకునే క్లైమాక్స్…. ఇలా కొలతలేసుకుని మరీ ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. దాంతో ఈ కథలో సహజత్వం మిస్ అయింది. ఏ జోనర్ కథల్ని అదే జోనర్లో తీస్తేనే మేలనే విషయం మరోసారి చాటి చెబుతుందీ చిత్రం. బాణంలాంటి సినిమాని తీసిన చైతన్య దంతులూరి… తన స్టైల్‌ని పక్కనపెట్టి రకరకాల భయాలు, లెక్కల మధ్య పనిచేసినట్టు అనిపిస్తుంది.
తెలుగు360 రేటింగ్ 2.5/5