హైదరాబాద్: మద్దెలచెరువు సూరి హత్యకేసు నిందితుడు భానుకిరణ్ మళ్ళీ తెరపైకి వచ్చాడు. బెయిల్ కోసం అతను దాఖలు చేసుకున్న పిటిషన్పై కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. తాను మూడేళ్ళుగా జైలులో ఉన్నానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని భాను పిటిషన్లో కోరాడు. అయితే అతనికి బెయిల్ మంజూరు చేస్తే పారిపోయే అవకాశం ఉందని సీఐడీ తరపు న్యాయవాది వాదించారు. ఇరు వాదనలూ పరిశీలించిన కోర్టు భాను బెయిల్ పిటిషన్ను కొట్టిపారేసింది.
మద్దెలచెరువు సూరి హత్య జరిగిన తర్వాత పరారైన భాను, సంవత్సరమున్నర తర్వాత దొరికాడు. సూరితో ఉన్నపుడు అనేక సెటిల్మెంట్లు చేశాడని, పలువురి భూములు ఆక్రమించుకున్నాడని, పలువురు టాలీవుడ్ హీరోయిన్లతో సంబంధాలు నెరిపాడని తర్వాత బయటపడిన సంగతి విదితమే.