‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ బాబు సీ.ఎమ్ అవుతాడని అందరికీ తెలుసు. అయితే.. ఆ ముచ్చట కాసేపే. చివరి 30 నిమిషాల్లో మహేష్‌ని సీఎమ్‌గా చూడొచ్చు. అయితే.. ఇందులోనూ ఓ వెన్నుపోటు ఎపిసోడ్ ఉందని తెలుస్తోంది. మహేష్ సీఎమ్ అయ్యాక… అతనికొస్తున్న ఫాలోయింగ్ భరించలేక, చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక… సొంత పార్టీలోనే మహేష్ ని వెన్నుపోటు పొడుస్తారని తెలుస్తోంది. ఆ విధంగా భరత్ పదవీత్యుతుడు అవుతాడట. తిరిగి… సీఎమ్ కూర్చీలో కూర్చోవడానికి భరత్ ఏం చేశాడు?? అనేదే క్లైమాక్స్.
కరెంట్ టాపిక్స్ పట్టుకుని సినిమాలు తీయడంలో కొరటాల దిట్ట. గ్రామాల దత్తత అనే పాయింట్ గురించి అంతగా తెలియని రోజుల్లోనే శ్రీమంతుడు సినిమా తీశాడు. ఆ సినిమా వచ్చాక గ్రామాల దత్తతపై ఓ అవగాహన వచ్చింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో దూసుకుపోతోందని రాష్ట్రాల ఆవేదన. ఇదంతా ఈసినిమాలో చూపిస్తారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఓ రాష్ట్ర సీమ్ కథ ఇదని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్రంపై తిరుగుబాటు చేస్తే ఊరుకుంటారా?? రాష్ట్ర ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసేయరూ…? ఈ సినిమాలోనూ అదే జరిగిందని, ఇందులో చాలా సన్నివేశాలు ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టేలా దర్శకుడు తెరకెక్కించాడని తెలుస్తోంది. మొత్తానికి నేటి వర్తమాన రాజకీయాలపై.. భరత్ బాణాలు వదలడానికి సిద్ధమయ్యాడన్నమాట.