‘రోబో 2’ విడుదల విషయంలో క్లారిటీ రాకపోవడం, తెలుగు సినిమాల్ని దెబ్బకొట్టే అంశమే. అందరి టార్గెట్ ఏప్రిల్ 27 అవ్వడంతో… ఇప్పుడు వాళ్ల ప్లానింగ్స్ అన్నీ మారిపోయాయి. ‘రోబో 2..’ ఎప్పుడొస్తుందో తెలీదు. దాని కోసం ఎదురుచూడడం, వచ్చాక తమ సినిమాల్ని తీసుకువద్దామనుకొంటే అంతకు మించిన టేమ్ వేస్ట్ పని ఇంకోటి ఉండదని మన నిర్మాతలకూ అర్థమైపోయింది. అందుకే రోబో 2తో సంబంధం లేకుండా రిలీజ్ డేట్లు ప్లాన్ చేసుకునే పనిలో పడ్డారు. అందరికంటే ముందుగా మహేష్ బాబు సినిమా ‘భరత్ అను నేను’ మేల్కొంది. ఈసినిమానీ ఏప్రిల్ 27నే విడుదల చేద్దామనుకొన్నారు. ఇప్పుడు రెండు వారాలు ముందుగా ఏప్రిల్ 13న ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మహేష్ ముందుకు రావడం, రజనీకాంత్‌కి భయపడినట్టు అయ్యిందంటూ నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు.
యాంటీ మహేష్ ఫ్యాన్స్‌కి ఇంతకంటే అదును ఏముంటుంది?? ఈ రేసుకి మహేష్ భయపడిపోయాడంటూ.. సెటైర్లు వేస్తున్నారు. కాకపోతే ఇంతకంటే మహేష్ చేసేది ఏం లేదు. ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్’ డిజాస్టర్లతో మహేష్ కోలుకోలేకపోతున్నాడు. ఈ దశలో రిస్క్ చేయడం కంటే, కాస్త తగ్గే ఉండడం మంచిది. ‘రోబో 2’ వస్తోందని తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవడం కంటే, రోబో కంటే ముందుగా విడుదల చేయడం మంచిదే. ఈ డేట్లో సినిమాని సిద్ధం చేయగలిగితే – సంక్రాంతికి కొబ్బరికాయ కొట్టే తొలి సినిమా మహేష్‌దే అవుతుంది. రోబో 2 ఏప్రిల్ 27న ఫిక్సయితే.. అల్లుఅర్జున్ సినిమా మే కి మారాల్సి రావొచ్చు.