‘భరత్ అనే నేను’ సినిమా లెంగ్త్ రెండు గంటల యాభై మూడు నిముషాలని నిర్మాత డీవీవీ దానయ్య తెలిపారు. కానీ, థియేటర్లో ప్రేక్షకుడికి అంత సమయం సినిమా చూశామనే సంగతి తెలీదన్నారు. రాజకీయాల నేపథ్యంలో ‘భరత్ అనే నేను’ చాలా సీరియన్‌గా సాగుతుందని ప్రచారం సాగుతోంది. అందులోనూ దగ్గర దగ్గరగా మూడు గంటలు అనేసరికి కొందరిలో లెంగ్త్ ఎక్కువై, వినోదం తగ్గితే ఫలితంపై ప్రభావం చూపుతుందేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిని చిత్ర బృందం అస్సలు పరిగణలోకి తీసుకొంటున్నట్టు కనిపించడం లేదు. ‘సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఏ మేరకు ఉంటుంది?’ అని దానయ్యను అడిగితే… ‘ఏవండీ! ప్రేక్షకులు ‘రంగస్థలం’ చిత్రాన్ని చూడట్లేదా? కొంతమంది ‘అమ్మో… మూడు గంటలా?’ అన్నారు. ఏమైంది? బ్లాక్‌బస్టర్ అక్కడ. థియేటర్లలో బ్రహ్మాండంగా ఆడుతోంది’’ అని సమాధానం ఇచ్చారు. అంతకు ముందు మూడు గంటల ‘అర్జున్‌రెడ్డి’నీ ప్రేక్షకులు ఆదరించారు. సో… ‘రంగస్థలం’ హిట్ ‘భరత్ అనే నేను’ టీమ్‌కి కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నమాట!