తెలుగు360.కామ్ రేటింగ్ : 3.5/5
ఎవరు ఆడే పేకలో అయినా పదమూడు ముక్కలే వుంటాయి. వాటిని సీక్వెన్స్ లు కట్టి, పద్దతిగా పేర్చి చూపించడంలోనే వుంది ఆటగాడి సత్తా.
భరత్ అనే నేను సినిమాలో ఓ డైలాగు వుంది.
”..రాంగ్ రూట్ లో వెళ్తే పాతిక వేలు పోయాయని బాధపడుతున్నారు.
అదే ప్రాణమే పోతే జీవితమే లేకుండా పోతుంది…” అంటూ.
ఈ డైలాగును పెద్ద సినిమాలు తీసే దర్శకులు గుర్తు పెట్టుకోవాలి ముందుగా. సరైన సినిమా తీయకపోతే కెరీర్ పోవడం మాత్రమే కాదు, కోట్ల రూపాయిలు కృష్ణార్పణం అయిపోతాయి. కేవలం దర్శకుడి మీదనే ఆధారపడి, హీరో కెరీర్, నిర్మాత, బయ్యర్ల డబ్బులు, సంస్థ పరువు ఇలా సమస్త ఆధారపడి వుంటాయి. ఆ ఒక్క వ్యక్తి, నేను నా ఇష్టం అన్నట్లు తన చిత్తానికి సినిమా తీసి అక్కడ పెడితే, జనం నచ్చక పక్కన పెడతారు. అదే సరైన సినిమా తీస్తే నీరాజనాలు పడతారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి స్పైడర్, నేటి భరత్ అనే నేను ఇందుకు సరైన ఉదాహరణలు. అక్కడ మురగదాస్ అండ్ కో చేయలేకపోయింది, ఇక్కడ కొరటాల శివ అండ్ టీమ్ చేయగలిగింది అదే. తమ సత్తా చూపించడం.
భరత్ అనే నేను సినిమాలో పెద్ద కథేం లేదు. కొత్త కథ అంతకన్నా కాదు. లీడర్, ఒకే ఒక్కడు లాంటి సినిమాల్లో చూపించిన లైన్ నే దర్శకుడు కొరటాల శివ తన స్టయిల్ లో తీసి చూపించాడు. తండ్రి (శరత్ కుమార్) మరణిస్తే కొడుకు భరత్ (మహేష్ బాబు) ను ముఖ్యమంత్రిని చేస్తాడు పార్టీ అధ్యక్షుడు వరదరాజులు (ప్రకాష్ రాజ్). కానీ భరత్ చేసే పనులేవీ, అతని సహచర ప్రజాప్రతినిదులకు నచ్చవు. అప్పుడు ఏం జరిగింది అన్నది సినిమా.
చాలా వరకు లీడర్ సినిమా ఛాయలు, మరి కొంచెం ఒకే ఒక్కడు సీన్లు గుర్తువస్తాయి భరత్ అనే నేను కథలో. కానీ ఎప్పుడు సినిమా చూసి బయటకు వచ్చాక. కానీ సినిమా చూస్తున్నంత సేపు మరేవీ గుర్తుకు రావు. అసలు ఆ మాటకు వస్తే, సినిమా ముక్క ముక్కలుగా వుంది..సరైన థ్రెడ్ లేదు అన్న ఆలోచన కూడా కలికంలోకి కూడా రాదు. ఎందుకంటే దర్శకుడి చాకచక్యం, సినిమాకు, తన టెక్నికల్ టీమ్ నుంచి, యాక్టర్స్ టీమ్ నుంచి తీసుకున్న అవుట్ పుట్ అన్నీ కలిసి ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేస్తాయి. సినిమా చూస్తున్నంత సేపూ ఒక బడా కమర్షియల్ దర్శకుడు సినిమా మేకింగ్ మీద, స్క్రిప్ట్ మీద ఇంత శ్రద్ద పెడతాడా, సినిమా మేకింగ్ లో ప్రతి చిన్న విషయాన్ని అంత శ్రద్దంగా చెక్కుతాడా? ఈ జనరేషన్ దర్శకుల్లో ఇది సాధ్యమా? అన్న ప్రశ్న వెంటాడుతుంది. ఎందుకంటే ఈ మధ్య టాలీవుడ్ లోని చాలా మంది బడా దర్శకులు ఇంత డిటైల్డ్ వర్క్ చేయడం అన్నది పూర్తిగా మానేసారు.
కొరటాల శివ చేసిన ఆ వర్క్, చూపిన ఆ శ్రద్ధ కారణంగానే భరత్ అనే నేను సినిమా ఓ మంచి సినిమాగా ప్రేక్షకులకు దగ్గరవుతుంది. అలా చూపకపోయినా, శ్రద్ద పెట్టకపోయినా, పాత కథను మళ్లీ తిప్పి చెప్పాడ్రా, అని సింపుల్ గా అనేసే ప్రమాదం వుండేది. భరత్ అనే నేను సినిమా సింపుల్ గా, కూల్ గా టేకాఫ్ తీసుకుంటుంది. ఒకే ఒక్కడు లో అర్జున్ మాదిరిగా ఇక్కడ మహేష్ తీసుకునే నిర్ణయాలు ఓ పక్క ఆలోచింపచేస్తూనే, ఎంటర్ టైన్ చేస్తుంటాయి. సహజంగానే కుట్రలు, కుతంత్రాలు, చివరకు సినిమా సుఖాంతం కావడం మామూలే. ప్రథమార్థాన్ని చాలా సులువుగా, చకచకా నడిపించేసాడు దర్శకుడు. ద్వితీయార్థంలో కాస్త గాడి తప్పాడు అనే కన్నా, చెప్పాల్సింది చెప్పేసాక, కథను ముగించడం కోసం ఆ దారిలో వెళ్లాడని అనుకోవాలి. ఇంకా సెకండాఫ్ లో కూడా చెబుతూనే వెళ్తే, నిడివి ఇంకా పెరిగే ప్రమాదం వుందని అలా చేసి వుండొచ్చు. బహుశా అందువల్లే కూడా సినిమా క్లయిమాక్స్ కాస్త అతికినట్లు వుండదు. అయితే కొరటాల చూపించిన ప్రతిభ వల్ల ఎక్కడా ఏ లోటూ ప్రేక్షకుడికి స్ఫురించదు సినిమా చూస్తున్నంత సేపూ. అదే ఈ సినిమాలో వున్న మ్యాజిక్.
కొరటాల శివ రెండు విదాల తన ప్రజ్ఞ చూపించాడు. ఒకటి రచయితగా, రెండు దర్శకుడిగా. సాధారణంగా రచయితలు పొలిటికల్ సినిమా అంటే తానులకు తానులు డైలాగులు రాస్తారు. కానీ కొరటాల శివ, చిన్న చిన్నవి పదునైన సంభాషణలు అందించాడు. తెలుగు పొలిటికల్ సినిమాల్లో ఈ తరహాప్రయత్నం చాలా తక్కువ. ఇక దర్శకుడిగా కొరటాల విశ్వరూపమే వుంది సినిమాలో. ప్రతి సీన్ ను కంప్యూటర్ లో కాలుక్యులేట్ చేసినట్లు, తూకం వేసినట్లు మలిచాడు. కొన్ని సీన్లు చూస్తుంటే, కొరటాల కు తన వర్క్ మీద ఇంత ధైర్యం, లేదా ప్రేక్షకుల మీద ఇంత నమ్మకం ఎలా వచ్చిందా? అనిపిస్తుంది. మరే దర్శకుడు అయినా చాలా సీన్లు లేపేసి, నిడివి తగ్గించేవాడేమో? అని కూడా అనిపిస్తుంది. దర్శకుడిగా ఏ చిన్న డిటైల్ కూడా మిస్ కానివ్వలేదు. ఆఖరికి మహేష్ బాబు ఓ సీన్లో ఎవరో తెచ్చిన జీప్ ఎక్కుతుంటే, ఆ డ్రయివర్ చూపించే భక్తి, వినయంతో సహా.
అయితే మాటల రచనలో, సినిమా మేకింగ్ లో చూపించిన శద్ధ కథ విషయంలో కూడా మరి కాస్త చూపించివుంటే ఇంకా బాగుండేది. వసుమతితో భరత్ వ్యవహారాన్ని మీడియా బయటకు తీసిన వెంటనే ఆమె ఇంటికి వెళ్లకుండా, రాజీనామా చేయడం అన్న పాయింట్ అంత కన్విన్సింగ్ గా లేదు. మోరల్ రిజైనింగ్ లేదా నైతిక బాధ్యత అన్నది ఎప్పుడు వస్తుంది? తప్పు చేస్తే? భరత్ అక్కడ తప్పేం చేయలేదు కదా? అదే విధంగా ద్వితీయార్థం అంతా ఓ థ్రెడ్ లో పిక్స్ కాని సంఘటనల సమాహారంగా కనిపిస్తుంది. మరి కాస్త థింక్ చేసి వుంటే వాటికి ఓ రిథమ్ వచ్చి వుండేదేమో? ఈ చిన్న లోపం తప్పిస్తే, భరత్ అనే నేను సినిమాకు వంక పెట్టడానికి లేదు.
దర్శకుడు కొరటాల శివ హీరో మహేష్ బాబు నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరి నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు. మహేష్ కెరీర్ లో నటనకు సంబంధించి ఇది అల్టిమేట్ అనుకోవాలి. ప్రకాష్ రాజ్ కు కూడా ఈ మధ్య కాస్త పని పెట్టిన క్యారెక్టర్ ఈ సినిమాలోదే.
ఇక భరత్ కు పని చేసిన టెక్నికల్ టీమ్ లో దేవీశ్రీప్రసాద్ ది టాప్ ప్లేస్. ఈ సినిమాకు ఆ స్థాయి రీరికార్డింగ్ లేకపోతే పరిస్థితి వేరుగా వుంటుంది. ప్రతి సీన్ ప్రేక్షకుడి గుండెకు చేరడం వెనుక కొరటాల కృషి ఎంత వుందో,దేవీ వర్క్ కూడా అంతకు అంతా వుంది. సినిమాటోగ్రాఫర్లు, ఆర్ట్ డైరక్టర్ వర్క్ కూడా ప్రశంసాపాత్రం గా వుంది.
చివరగా చెప్పుకోదగ్గ గొప్ప విషయాలు రెండు వున్నాయి. ఎక్కడా ఏ ఒక్క రాజకీయ పార్టీని టచ్ చేయలేదు. ఏ ఒక్క రాజకీయనాయకుడి మీద సెటైర్ వేయలేదు. అన్నింటికి మించి, ఏ పాత్ర పేరుకు చివరన్న కులాల తోకలు తగిలించలేదు.
ఫినిషింగ్ టచ్
రివ్యూ రాసిన నేను..హామీ ఇస్తున్నాను..వెళ్లి చూడాల్సిన సినిమా
తెలుగు360.కామ్ రేటింగ్ : 3.5/5