‘భరత్ అనే నేను’ అనే టైటిల్ విన్నప్పటి నుంచీ… ఈ సినిమా టెంపో ఏమిటో.. చూచాయిగా ఉప్పు అందుతూనే ఉంది ప్రేక్షకులకు. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తారని అభిమానులు ఎప్పుడో ఫిక్సయిపోయారు. ఇదో పొలిటికల్ డ్రామా అనే విషయాన్ని చిత్రబృందం ఎప్పటికప్పుడు బలంగా ఫోకస్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు టీజర్లోనూ అదే కనిపించింది. కొరటాల శివ సినిమాలన్నీ కమర్షియల్ కథలే. అయితే అందులోనూ ఓ బలమైన సామాజిక అంశం ముడి పడి ఉంటుంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌లలో అదే చేశాడు కొరటాల. ఈసారీ… `భరత్ అనే నేను`లో ఓ బలమైన పాయింట్‌ని పట్టుకున్నాడనిపిస్తోంది టీజర్ చూస్తుంటే.
”చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే…. యువర్ నాట్ కాల్డ్ ఏ మాన్” అంటూ మహేష్ డైలాగ్ తో టీజర్ మొదలైంది. టీజర్ అంతా మహేష్ మాట.. మహేష్ రూపు మాత్రమే కనిపించాయి. ఇంటెన్సిటీ ఎక్కడా పోకుండా.. జాగ్రత్త పడ్డాడు కొరటాల. పంచ్ డైలాగుల కోసం తాపత్రయ పడకుండా… కథ నడిచే దారేదో చెప్పే ప్రయత్నం చేశాడు. రాజకీయాలు అనగానే మాస్ కథేమో అనిపిస్తుంది. కానీ.. దాన్ని ఎంత స్టైలీష్ గా చూపించొచ్చో.. మచ్చుక్కి ఈ టీజర్లో చూపించేశాడు. ఈ కథలో ఏం చెప్పబోతున్నాడో… దాన్ని టీజర్లో క్లుప్తంగా, సూటిగా వివరించాడు కొరటాల. భరత్ రామ్‌గా మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయంగా అనిపిస్తోంది. క్యాజువల్ డ్రస్ లో మహేష్ వాక్, స్టైల్ ఇవన్నీ ఫ్యాన్స్‌ని ఫిదా చేయడం గ్యారెంటీ. విజువల్స్ , నేపథ్య సంగీతం ఇవన్నీ హై క్లాస్‌గా కనిపిస్తున్నాయి. పొలిటికల్ సినిమాల్లో ‘ఒకే ఒక్కడు’ చరిత్ర సృష్టించింది. దాన్ని అందుకునే స్థాయి తప్పకుండా ‘భరత్ అనే నేను’కి ఉంది అన్న భరోసా కల్పించింది ఈ టీజర్.