ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో వుంది. తాజాగా ఈ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ రోజు ప్రధాని మోడీ అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర క్యాబినేట్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చిన కథనాలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. కేంద్రం ఎప్పుడు ఈ అవార్డులు ప్రకటించినా ఈ ప్రతిపాదనపై చర్చ జరుగుతుంటుంది. ప్రపంచ నలుమూల నుంచి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తుంటాయి. కళారంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్. తన నటనతో ఆబాలగోపాలాన్ని అలరించారు. రాజకీయాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టారు.
ఎన్టీఆర్ తీసుకొచ్చిన మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 శాతం రిజర్వేషన్లు, ఇలా చెప్పుకుంటూపొతే ఆయన మొదలుపెట్టిన ఎన్నో ప్రాజెక్ట్స్, పథకాలు, సంస్కరణలు దేశానికే తలమానికంగా నిలిచాయి. ఆయనకి భారతరత్న ఇవ్వడం అందరికీ గర్వకారణం. కానీ ఏవో రాజకీయ కారణాల వలన ఆలస్యమౌతూ వస్తుంది. ఇప్పుడు మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది. మరి క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.