తెలుగు ప్రజలు గర్వించదగిన వ్యక్తుల్లో రామోజీరావు ఒకరు. పత్రికాధినేతగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఆయన వేసిన ముద్ర మహోన్నతమైనది. వేలాదిమందికి ఉద్యోగాలిచ్చి, వాళ్ల జీవితాల్లో వెలుగుకు కారణమయ్యారు. ముఖ్యంగా పత్రికారంగంలో ఆయన చేసిన సాహసాలు, వేసిన కొత్త అడుగులు ఓ చరిత్ర. రామోజీరావు కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఆయన మరణానంతరం భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈరోజు రామోజీరావు సంస్మరణ సభ సందర్భంగా భారతరత్న డిమాండ్ ఇంకోసారి బలంగా వినిపించారు. చంద్రబాబు నాయుడు, రాజమౌళి తదితర ప్రముఖులంతా భారతరత్నపై గళం విప్పారు.
కేంద్ర ప్రభుత్వంలో కూటమి భాగస్వామిగా ఉంది. చంద్రబాబు, జనసేన భాగస్వామ్యంతోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. చంద్రబాబు నాయుడు కాస్త దృష్టి పెడితే, రామోజీరావుకు భారతరత్న సాధించడం పెద్ద కష్టమేం కాదు. పైగా రామోజీరావుకూ మోదీకి సత్సంబంధాలు ఉండేవి. అందుకే భారతరత్న ఆశలు మరింత చిగురించాయి. కాకపోతే… భారతరత్న తెలుగు వాళ్లకు ఇవ్వాలంటే ముందుగా ఎన్టీఆర్ నుంచి మొదలు పెట్టాలి. ఈ క్రమంలో ఘంటసాల లాంటి మహామహుల పేర్లు ఈ వరుసలో కనిపిస్తాయి. వాళ్లకు ఇచ్చిన తరవాతే.. ఆ అవకాశం రామోజీరావు వరకూ వస్తుంది. ముందుగా ఎన్టీఆర్‌కు భారతరత్న తెచ్చుకొనే బాధ్యత టీడీపీ ప్రభుత్వంపై ఉంది. చాలా ఏళ్లుగా ఎన్టీఆర్‌కు భారతరత్న పెండింగ్ లో ఉంది. ఈ ఐదేళ్లలో ముందుగా ఎన్టీఆర్‌కు భారతరత్న తెచ్చుకొంటే, ఆ తరవాత మిగిలినవాళ్ల గురించి అడగొచ్చు. సో.. ముందుగా ఎన్టీఆర్ కోసం కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే మంచిది.