రిపబ్లిక్ డే సందర్భంగా.. భారత ప్రభుత్వం ముగ్గురికి భారతరత్న పురస్కారాలు ప్రకటించింది. కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆరెస్సెస్ దివంగత ప్రముఖుడు నానాజి దేశ్ ముఖ్, ప్రముఖ కళాకారుడు భూపేన్ హజారికాలకు ఈ పురస్కారాలు ప్రకటించారు. ప్రణబ్ మినహా.. ఇద్దరికీ.. మరణానంతరం పురస్కారం ప్రకటించారు. మిగతా ఇద్దరి సంగతేమో కానీ.. ప్రణబ్ ముఖర్జీకి ఇంత అర్జంట్ గా భారతరత్న ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో.. చాలా మందికి సులువుగానే అర్థమైపోతోంది. అధికారంలోకి వచ్చిన ఆరెస్సెస్ దిగ్గజాలకు.. భారతరత్న ఇచ్చిన.. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు.. జీవితాంతం కాంగ్రెస్ వాదానికి కట్టుబడిన ప్రణబ్ ముఖర్జీకి.. భారతరత్న ప్రకటించింది.
నిస్సందేహంగా ప్రణబ్ ముఖర్జీ దిగ్గజం అనదగ్గ నేత. కానీ.. ఇంత వరకూ ఏ ఒక్కరు కూడా.. ఆయనకు.. భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం… ఆయనలో భారతరత్నని చూసింది. ఎన్నికలకు ముందుగా.. ప్రకటించేసింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ ఉంటూ.. నినాదాలు ఇస్తూ.. అదే కాంగ్రెస్ వాదాన్ని నరనరాన జీర్ణించుకున్న… ప్రణబ్ ముఖర్జీకి.. అత్యున్నత పురస్కారం ప్రకటించడం వెనుక ఉన్న నిజంగానే గౌరవమా… లేక రాజకీయమా అన్న అనుమానం రాక మానదు. ప్రణబ్ ముఖర్జీ.. ప్రైడ్ ఆఫ్ బెంగాల్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వడం వెనుక ఉన్న ప్రధానమైన కోణం ఇదే. బెంగాల్ లో రాజకీయంగా బలపడటానికి భారతీయ జనతా పార్టీ తాము చేయాల్సిందంతా చేస్తోంది. కానీ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం.. అడుగు పెట్టనీయడం లేదు.
దీంతో నరేంద్రమోడీ… బెంగాల్ ప్రజలను… మరో విధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకే ప్రణబ్ ముఖర్జీకి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించారు. ఇప్పుడు.. బెంగాలీకి .. అత్యంత గౌరవం ఇచ్చానని చెబుతూ.. నరేంద్రమోడీ, అమిత్ షా.. బెంగాల్ ప్రజల్లోకి సెంటిమెంట్ రగిలించడానికి సిద్ధమవుతున్నారు. ప్రబణ్ నే బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని బెంగాల్ లో ఎన్నికలకు వెళ్తున్నారు. నానాజి దేశ్ ముఖ్ మహారాష్ట్రకు చెందిన వారు. భూపేన్ హజారికా.. అసోంకు చెందిన వారు. మహారాష్ట్రాలో శివసేన ఒంటరి పోటీకి వెళ్తూండటంతో.. అక్కడ హిందూత్వ వాదుల్లో ఆదరణ నిలుపుకోవడానికి.. పౌరసత్వ బిల్లుతో బీజేపీపై అక్కడ రేగుతున్న అసంతృప్తిని చల్లబర్చడానికి.. ఈ అవార్డులను.. మోడీ ఉపయోగిచుంకున్నట్లు తెలుస్తోంది.