ఆఫ్ఘానిస్తాన్ లో మజారీ షరీఫ్ నగరంలో ఉన్న భారత కౌన్సిలేట్ కార్యాలయంపై నలుగురు ఉగ్రవాదులు ఆదివారం రాత్రి దాడి చేసారు. కౌన్సిలేట్ భవనానికి సమీపంలో ఉన్న మరో భవనంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించే ప్రయత్నం చేసారు. కానీ భద్రతాదళాలు అప్రమత్తంగా ఉన్నందున వారి దాడిని తిప్పికొట్టాయి. భారత దౌత్యాధికారులందరినీ కౌన్సిలేట్ భవనం లోపలే ఉన్న ఒక సురక్షితమయిన ప్రదేశానికి తరలించారు. అందరూ క్షేమంగా ఉన్నారని భారత కౌన్సిలేట్ జనరల్ బ్రజబాషి సర్కార్ ప్రకటించారు.
భారత కాలమాన ప్రకారం రాత్రి 10-10.30 గంటల సమయంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలియగానే ఆఫ్ఘనిస్తాన్ భద్రతాదళాలు, పోలీసులు అక్కడికి చేరుకొని ఉగ్రవాదులున్న భవనాన్ని చుట్టుముట్టారు. భద్రతాదళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ప్రస్తుతం మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులకి, భద్రతాదళాలకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించుకోలేదు.
ప్రధాని నరేంద్ర మోడి ఆకస్మికంగా లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసి వచ్చిన తరువాత ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది. అప్పటి నుండే భారత్ లక్ష్యంగా దాడులు మొదలయ్యాయి. జనవరి 1వ తేదీన పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. మళ్ళీ నిన్న రాత్రి ఈ దాడి జరిగింది. బహుశః భారత్-పాక్ మధ్య శాంతి చర్చలను వ్యతిరేకిస్తున్న శక్తులే ఈ దాడులకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.