దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, ఎన్నో అవంతరాలను ఎదుర్కొంటూ దేశాన్ని ప్రపంచం ముందు సొంత కాళ్లపై నిలబెట్టిన మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుకు గొప్ప గౌరవం దక్కింది. మాజీ ప్రధాని పీవీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం అయిన భారత రత్న పురస్కారం ప్రకటించింది.
భారత రత్న పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పీవీకి గౌరవం దక్కగా… పీవీ నర్సింహరావు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నర్సంపేటలో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నంధ్యాల ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యారు పీవీ.
పీవీ నర్సింహరావు ఏపీ నుండే కాదు మహారాష్ట్రలోని రామ్ టెక్ లోక్ సభ స్థానం నుండి వరుసగా రెండుసార్లు గెలుపొందగా, ఒడిశాలోని బ్రహ్మపుర్ స్థానం నుండి కూడా లోక్ సభకు గెలుపొందటం విశేషం.
మైనారిటీ ప్రభుత్వాన్ని కేంద్రంలో సక్సెస్ ఫుల్ గా నడిపిన పీవీ… దేశంలోని అన్ని భాషల్లోనూ ఆయనకు ప్రావీణ్యం ఉండటం విశేషం. దాదాపు 17 భారతీయ భాషలతో పాటు ఇతర దేశాల భాషల్లోనూ ఆయన అనర్గళంగా మాట్లాడగల సత్తా ఉన్న వ్యక్తి.
అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం 1998లో నిర్వహించిన న్యూక్లియర్ పరీక్షలు 1996లోనే చేయాల్సింది. అప్పటి ప్రధానిగా పీవీ ప్రత్యేక దృష్టి పెట్టి సహయ సహకారాలు అందించగా, 1996 ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోవటంతో న్యూక్లియర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో పీవీ… అప్పటి ప్రధాని వాజ్ పేయి తో మాట్లాడి, న్యూక్లియర్ పరీక్షలు జరగటంలో చొరవ చూపారని అప్పట్లో దగ్గర చూసిన వారు అంటుంటారు.