ఓ స్టార్ హీరో పిలిచి – ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తే,
కాదంటాడా?
చేయనంటాడా?
ఎగిరి గంతేస్తాడు. తన దగ్గర కథ లేకపోయినా అప్పటికప్పుడు వండేస్తాడు. మీతో సినిమా చేయడంతో నా జన్మ ధన్యం అంటాడు. నూటికి తొంభై తొమ్మిది మంది ఇలానే ఉంటారు. కానీ.. ఒకరో ఇద్దరో వేరేలా ఉంటారు. వేరేలా అంటే… భారతీరాజా, జంథ్యాల లా.
ముందు భారతీరాజా దగ్గరకు వద్దాం. ఆయన మెగాఫోన్ పట్టిన కొత్తలో తమిళ నాట నలుగురే సూపర్ స్టార్స్. ఎంజీఆర్, శివాజీ గణేషన్, జయ శంకర్, శివ కుమార్.. వీళ్లే స్టార్స్. ఒకే సీజన్లో వీళ్ల సినిమాలన్నీ విడుదలకు పోటీ పడుతుండేవి. దాంతో… థియేటర్లన్నీ కళకళలాడిపోయేవి. ఒక దశలో పోస్టర్లు అంటించడానికి గోడలు కనిపించేవి కావని చెప్పుకుంటుంటారు. ఆ స్థాయిలో ఉండేది వాళ్ల తాకిడి. అప్పుడే చిత్రసీమలోకి అడుగుపెట్టాడు భారతీ రాజా. కొత్త కొత్త వాళ్లని ఎంచుకుని, చిన్న చిన్న సినిమాలు తీసేవాడు. అవన్నీ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ఆడేవి. ప్రతీ సినిమా.. సూపర్ హిట్టే. యేడాదికి నాలుగైదు సినిమాలు తీసి వదిలేవాడు భారతీరాజా. కొత్త రకం కాన్సెప్టులు, కొత్త తరహా నటన చూసి జనాలూ వెర్రెత్తిపోయేవారు. ఓ దశలో భారతీ రాజా తాకిడికి.. పెద్ద హీరోలంతా తట్టా బుట్టా సర్దేసుకునే పరిస్థితి వచ్చింది
అలాంటి ఓ దశలో.. భారతీ రాజాకు పిలుపొచ్చింది. శివాజీగణేశన్ దగ్గర్నుంచి.
”నీ సినిమాలు బాగుంటున్నాయి. నేను కూడా చూస్తున్నాను. నాతో ఓ సినిమా చేస్తావా” అని నోరు విప్పి అడిగారు శివాజీ. అప్పటికి ఆయన కాల్షీట్ల కోసం బడా నిర్మాతలు, దర్శకులు క్యూలు కడుతున్నారు.
అయితే.. భారతీ రాజా మాత్రం ”సారీ సార్.. మీతో నేను సినిమా చేయను. మీ ఇమేజ్‌కి తగ్గ కథలు నా దగ్గర లేవు” అనేశాడు.
”అదేంటి.. నా అంతట నేను పిలిస్తే.. అడిగానని లోకువా’ అని ఆవేశ పడ్డారు పెద్దాయన. కానీ భారతీ రాజా మాత్రం..
”ప్రతీ నటుడికీ, స్టార్కీ ఎత్తూ పల్లాలుంటాయి. మీ ఇమేజ్, మీ స్టార్ డమ్ మీ దగ్గర నుంచి పోయిన రోజున తప్పకుండా మీతో సినిమా చేస్తా” అనేశాడు. దాంతో ఇంకాస్త కోపం వచ్చింది శివాజీకి.
”నీతో సినిమా చేయాలంటే నా ఇమేజ్, స్టార్ డమ్ పోవాలా.. గెటవుట్..” అంటూ భారతీరాజాని బయటకు పంపేశారు. ఇది జరిగిన కొన్నాళ్లకు.. దర్శకుడిగా భారతీరాజా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. శివాజీ గణేషణ్ స్టార్డమ్ తగ్గి, క్రేజ్ తగ్గి, కొత్త వాళ్లకు దారి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకో ఆ సమయాన భారతీ రాజా గుర్తొచ్చాడు శివాజీ గణేషన్‌కు. ఫోన్ చేసి మళ్లీ పిలిపించాడు.
”అప్పుడు నువ్వు చెప్పావు కదా.. ప్రతీ స్టార్కీ ఎత్తు పల్లాలు ఉంటాయని. స్టార్ డమ్ పోయే రోజు వస్తుందని. బహుశా నేను దశలోనే ఉన్నాననిపిస్తోంది. ఇప్పుడు నాతో సినిమా చేస్తావా” అని మళ్లీ అడిగారు.
ఈసారి భారతీరాజా ‘నో’ చెప్పలేదు. ”తప్పకుండా మీతో సినిమా చేస్తా” అంటూ.. ‘మొదల్ మర్యాదే’ కథ చెప్పాడు. శివాజీగణేశన్, రాథ, వడివక్కరసు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా తమిళనాట పెద్ద హిట్. అప్పటి వరకూ జనం చూసిన శివాజీ గణేషన్ వేరు, ఈసినిమాలో కనిపించిన శివాజీ గణేశన్ వేరు. శివాజీ నటనలో ఎక్కువ నాటకీయత కనిపించేది. ఆయన సహజంగా నటిస్తే ఎలా ఉంటుందో అన్నదానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమా యేడాది ఆడి, అప్పటి రికార్డులన్నింటినీ తుడిచి పెట్టుకుని పోయేలా చేసింది. దాన్నే తెలుగులో ‘ఆత్మ బంధువు’ పేరుతో డబ్ చేశారు. ఇక్కడా సూపర్ హిట్ గా నిలిచింది.
ఇప్పుడు జంథ్యాల దగ్గరకు వద్దాం. దర్శకుడు కాకముందు.. జంథ్యాల రచయితగా కీర్తి గడించారు. ఓ వైపు వేటగాడు లాంటి కమర్షియల్ సినిమాకి మాటలు రాసి, రెండో వైపు శంకరాభరణం చిత్రానికి సంభాషణలు అందించారు. ఎంతటి వైవిధ్యం..? ఈ రెండు సినిమాలూ ఒకే యేడాది విడుదలై… రెండు అద్భుతాలుగా నిలిచాయి. ఈ రెండు సినిమలకూ మాటలు రాసింది ఒక్కరేనా? అంటూ ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయారు. అందుకే ఓసారి జంథ్యాలకు పిలిచారు.
”బ్రదర్.. మీ పని తీరు నాకు నచ్చింది. భవిష్యత్తులో దర్శకుడు కావాలన్న ఆలోచన వస్తే.. మొదటి కథ నాకే చెప్పండి. మనం సినిమా చేద్దాం” అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
నిజానికి ఏ దర్శకుడైనా.. ఆ ఆఫర్‌కి ఉబ్బితబ్బుబ్బి అవ్వాలి. కానీ జంథ్యాల అలా అవ్వలేదు.
”సార్.. మీతో ఎవరు సినిమా చేసినా, అది ఎన్టీఆర్ సినిమా అయిపోతుంది. ఎంత బాగా ఆడినా దర్శకులకు పేరు రాదు. మహా వృక్షం నీడలో చిన్న చిన్న మొక్కలు బతకలేవు. దర్శకుడిగా నా శైలి జనాలకు తెలియాలంటే కొత్త వాళ్లతోనే సినిమా తీయాలి. అలా తీసి నిరూపించుకుంటే, దర్శకుడిగా నాకూ పేరొస్తే… అప్పుడు మీతో తప్పకుండా సినిమా చేస్తా” అంటూ గౌరవంగా చెప్పి, మర్యాదగా అక్కడి నుంచి వచ్చేశారు జంథ్యాల. ‘ముద్ద మందారం’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా మారారు. అయితే అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాలతో బిజీ అయిపోవడం వల్ల.. ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం జంథ్యాలకు రాలేదు.