కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం `భారతీయుడు 2`. కాంబినేషన్ పరంగా, సీక్వెల్ పరంగా.. భారీ అంచనాలు ఏర్పరచుకున్న సినిమా ఇది. అయితే ముందు నుంచీ ఈ సినిమా కి అవరోధాలే. మరీ ముఖ్యంగా బడ్జెట్ సమస్యలతో ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది. అసలు ఈ సినిమా మళ్లీ మొదలవుతుందా? మొదలైనా శంకర్ దర్శకుడిగా ఉంటాడా? అనే అనుమానాలు రెకెత్తాయి. లాక్డౌన్ తరవాత… సినిమా షూటింగ్ మొదలవుతుందని భావించినా, కమల్ హాసన్ ఈ సినిమాకి పక్కన పెట్టి `విక్రమ్`పై దృష్టి పెట్టడం తో ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయని అనుకున్నారు.
అయితే భారతీయుడు గొడవ సర్దుమణిగింది. జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. శంకర్ ఇప్పటికే ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడట. జనవరి లోగా `విక్రమ్` సినిమాని పూర్తి చేయాలని కమల్ అనుకుంటున్నాడు. అది అవ్వగానే… `భారతీయుడు 2` మళ్లీ మొదలు కానుందని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో శంకర్, లైకా ప్రొడక్షన్ ఓ అవగాహనకు వచ్చారని, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమాని పూర్తి చేస్తానని శంకర్ నిర్మాతలకు హామీ ఇచ్చాడని, కమల్ హాసన్ కూడా కీలకమైన సమయంలో శంకర్‌కి మద్దతుగా నిలిచాడని తెలుస్తోంది. అందుకే బడ్జెట్ గొడవలు ఓ కొలిక్కి వచ్చాయట. త్వరలో జరగబోతున్న తమిళనాడు ఎన్నికలలో కమల్ హాసన్ పోటీ చేయబోతున్నాడు. రాజకీయ పరంగా `భారతీయుడు 2` సినిమా తనకి ప్లస్ కావాలనుకుంటున్నాడు. అందుకే.. ఎన్ని గొడవలు వచ్చినా.. ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లాలన్నది కమల్ ప్రయత్నం.