ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పరంగా జరిగే సిమెంట్ కొనుగోళ్లు అత్యధికం ఎవరి కంపెనీకి చెందినవి ఉంటాయి..?. ఇంకెవరివి ఉంటాయి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతి సిమెంట్వే ఉంటాయని… ఆయనంటే గిట్టని వారు అంటూ ఉంటారు. ఎందుకంటే అధికార దుర్వినియోగం చేసుకుని ఆయన సొంత మేళ్లు చేసుకుంటారని వారి అభిప్రాయం. అయితే రికార్డులు కూడా.. అదే చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంటున్న సిమెంట్‌లో అత్యధిక భాగం భారతి సిమెంట్ నుంచే కొంటోంది. ఆ తర్వాత కొనుగోళ్లు చేసేది ఇండియా సిమెంట్స్ నుంచి. అంటే… జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహ నిందితుడు ఇప్పటికీ.. వారం వారం కోర్టు చుట్టూ తిరిగే శ్రీనివాసన్ కంపెనీ. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన చరిత్ర ఆయనకు ఉంది.
ఎనిమిది నెలల కాలంలో ప్రభుత్వం భారతి సిమెంట్స్ నుంచి 2 లక్షల 28 వేల 370 మెట్రిక్ టన్నుల సిమెంట్ కొనుగోలు చేసింది. ఇది మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన సిమెంట్‌లో 14 శాతం. తర్వాత అక్రమాస్తుల కేసులో సహ నిందితుడైన శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ నుంచి లక్షా యాభై తొమ్మిది వేల వేలకుపైగా మెట్రిక్ టన్నులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే ఈ రెండు కంపెనీలకే 30 శాతం ప్రభుత్వ కొనుగోలు వాటా దక్కింది. అయితే ఇక్కడ ఓ విషయం ఉంది. ఎంత అమ్మినా.. ఎవరి దగ్గర కొన్నా.. ప్రభుత్వానికి సిమెంట్ కంపెనీలు రూ. 225కే సరఫరా చేయాలనే నిబంధన పెట్టింది. దాని ప్రకారం.. ఇలా ఎంత ఎక్కువ సరఫరా చేసినా… భారతి సిమెంట్‌కు లాభం ఉండదన్న విశ్లేషణ కూడా సిమెంట్ ఇండస్ట్రీలో ఉంది.
అయితే… సిమెంట్ కంపెనీలు ఇలా ప్రభుత్వానికి రూ. 225కి సరఫరా చేయడం వల్ల… ధరల విషయంలో పట్టించుకోమనే ఓ అప్రకటిత నిబంధన అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సిమెంట్ కంపెనీలన్నీ సిండికేట్ అయిపోయి మార్కెట్లో కొరత సృష్టిస్తున్నాయి. ఫలితంగా సిమెంట్ బస్తా నాలుగు వందలకు చేరిందని కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం కల్పించుకోవడం లేదు. గతంలో ఇలా పెరిగినప్పుడు ప్రభుత్వాలు హెచ్చరికలు చేసేవి. ఓ సారి ఇలా అనైతిక మార్కెటింగ్‌తో లాభాలు పొందినందుకు.. ఇండియా సిమెంట్స్‌కు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున జరిమానా కూడా విధించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వాల మద్దతు ఉండటంతో సిమెంట్ కంపెనీలు ఆడిందే ఆటగా మారుతున్నాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతి సిమెంట్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన వికాట్ కు వాటాఉంది. ప్రస్తుతం ధరల పెరుగుదల వల్ల.. ఒక్క ఏడాదిలో భారతీ సిమెంట్స్‌కు రూ. వెయ్యి కోట్ల అదనపు లాభం వస్తుందని.. ఆకంపెనీ తన నివేదికలో పేర్కొంది. దీన్నే తెలుగుదేశం పార్టీ హైలెట్ చేస్తోంది. సిమెంట్ కంపెనీల ధరల పెరుగుదల వెనుక జగన్ స్వార్థం ఉందని ఆరోపిస్తోంది.
ఇంకా శంకుస్థాపనే చేయని తమ కంపెనీలకు నీళ్లు, గనులు కేటాయింపులు చేసుకున్నా… సొంత పత్రికలు, చానళ్లకు నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనంతో ప్రకటనలు పారించుకున్నా ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అది నైతికత కాదు అని అనిపించలేదు. అలాగే… తన సిమెంట్ కంపెనీకి.. తన కంపెనీల్లో క్విడ్ ప్రో కో కింద పెట్టుబడులు పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌కు ఏపీ ప్రభుత్వ సిమెంట్ ఆర్డర్లలో అత్యధికభాగం ఇచ్చేసినా.. నైతికత కాదు అని అనుకునే ప్రశ్నే లేదు. అది వ్యాపారం అని అనుకుంటారు. అందుకే అది అలా జరిగిపోతూ ఉంటుంది.