భారతీయజనతా పార్టీ కూటమి తరపున ఓట్లు అడిగేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసిన తర్వాత వారిని ఒక్క బీజేపీ అభ్యర్థిగా మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్నారు. తమ బలానికి మెచ్చి ఇచ్చి న సీట్లుగా వారు ఫీలవుతున్నారేమో తెలియదు కానీ … కూటమిలో ఉన్నట్లుగా కాకుండా.. తాము ఒంటరిగా పోటీ చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కమలం గుర్తు ఒక్క దాన్నే ప్రచారంలోకి తెస్తున్నారు.
పార్లమెంట్ సీటులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. వాటిలో టీడీపీ, జనసేన అభ్యర్థులు ఉంటారు. ఆ విషయం తెలిసి కూడా.. సోషల్ మీడియాలో అపోహలు వచ్చేలా.. బీజేపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తూండటం పై రాజకీయవర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఓ వైపు టీడీపీ,జనసేనలు .. ఓ లోగో పెట్టుకుని.. తమ పోస్టర్లన్నింటిపై మోదీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినా బీజేపీ నేతలు మాత్రం.. ఈగోకు పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
దేశంలో బీజేపీ బలమైన పార్టీ కావొచ్చు కానీ…దేశంలో ఆ పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నోటుక సరిపడా ఓట్లు కూడా రావు. అయినా… వారు తమ రేంజ్ ఏదో అని ఊహించుకుంటున్నారన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రయోజనాలు షెడ్యూల్ వచ్చి పది రోజులు అయినా కనిపించకపోవడంతో… అటు టీడీపీ, జనసేనల్లో అసహనం పెరిగిపోతోంది. ఇది ఎక్కడకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.