అక్రమాస్తుల కేసులో ఈడీ జప్తు చేసిన ఆస్తుల పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పిటిషన్ విచారణకు రాలేదు. జస్టిస్ రామసుబ్రమణియన్ ఎదుటకు ఈకేసు రావాల్సి ఉంది. జాబితాలో పదహారో కేసుగా నమోదయింది.కానీ పదిహేనో కేసు తర్వాత పదిహేడో కేసుకు న్యాయమూర్తి వెళ్లిపోయారు. దీంతో ఆ కేసు విచారణకు రానట్లయింది. దీనికి కారణం బెంచ్ హంటింగ్ ఆరోపణలు రావడమేనని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
మూడు రోజుల నుంచి జగన్ అక్రమాస్తుల కేసు ఇలా పలు బెంచ్‌లను మార్చి.. వైసీపీ ఎంపీ కమ్ లాయర్ నిరంజన్ రెడ్డి కుమారుడు లా క్లర్క్ గా పని చేస్తున్న న్యాయమూర్తి బెంచ్ ఎదుట రిజిస్టర్ కావడం సంచలనం అయింది. దీనిపై ఢిల్లీలోనూ విస్తృత చర్చ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. భారతీ సిమెంట్స్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ కోర్టు, హైకోర్టు వ్యతిరేకంగా తీర్పును వెలువరించాయి. హైకోర్టు తీర్పును సుప్రీంలో ఈడీ సవాలు చేసింది.
ఈ కేసును మొదట జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్ల బెంచ్ ముందు రిజిస్ట్రీ విచారణకు ఉంచింది. మొదటి విచారణ సందర్భంగా తదుపరి తేదీకి జస్టిస్ కృష్ణ మురారి, వి.రామసుబ్రమణ్యన్ల ధర్మాసనం వాయిదా వేసింది.తరువాత కేసు విచారణను జస్టిస్ మురారి, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ముందు విచారణకు రిజిస్ట్రీ లిస్ట్ చేసింది. అయితే హఠాత్తుగా జాబితా నుంచి కేసు మాయమై.. జస్టిస్ రామసుబ్రమణియన్ బెంచ్ ముందుకు వచ్చింది. అసలు ఇలా ఎలా వచ్చిందని.. అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీంతో ఈ కేసు విచారణను జస్టిస్ తీసుకోలేదని భావిస్తున్నరు. ఈ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందోనని.. వైసీపీ న్యాయవర్గాలు కూడా ఉత్కంఠకు గురవుతున్నాయి.