తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల్లో గెలిచేందుకు ఇతర పార్టీలపై ఎత్తులు పై ఎత్తులు వేయడం ఎప్పుడో మర్చిపోయారు. ఆయా పార్టీలతో సన్నిహితంగా వ్యవహరిస్తూ.. సొంత పార్టీలోని నేతలపై ఎత్తులు.. పై ఎత్తులు వేస్తున్నారు. తాజాగా పాదయాత్రపై జరుగుతున్న రేస్‌లో ఎవరిది పై చేయి అవుతుందో అనుకునే పరిస్థితుల్లో భట్టి విక్రమార్క్ ఓ రాయి విసిరేశారు. త్వరలో రాష్ట్రమంతా పాదయాత్ర చేసేస్తానని మీడియా ముందు ప్రకటించారు. ఇప్పటికే ఆయన తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల కారణంగా విరామం ఇచ్చారు. ఎక్కడ ముగించారో అక్కడే నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. నియోజకవర్గం వరకూ పాదయాత్ర చేస్తానని చెబితే సరిపోయేది కానీ.. ఆయన పార్టీలో జరుగుతున్న రచ్చ గురించి తెలిసి కూడా రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని ప్రకటించేశారు. పాదయాత్ర చేసి పార్టీకి ఊపు తేవాలని రేవంత్ రెడ్డి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. హైకమాండ్ నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ చర్చకు పెట్టారు. ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది.
ఇతరులు కూడా పాదయాత్ర చేపడతామని ముందుకు వచ్చినా పీసీసీచీఫ్ కాబట్టి రేపో మాపో ఆయనకు పర్మిషన్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క అడ్డుపుల్ల వేసేందుకు బహిరంగంగా పాదయాత్ర ప్రకటన చేశారు. ఈ చర్చ ఇలా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం.. ఎవరి ఎజెండానూ మార్చుకోవడం లేదు.