ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ లో శాఖల విభజన చేశారు సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క. ఒక్కో నాయకుడికీ ఒక్కో శాఖ కేటాయించారు. ఎవరికి కేటాయించిన అంశంపై వారు మాత్రమే అసెంబ్లీలో మాట్లాడాలని నిర్ణయించారు. ఇవాళ్ల జరిగిన సీఎల్పీ సమావేశంలో అధికార పార్టీ తెరాస మీద ఇకపై వ్యూహాత్మకంగా పోరాటం ఉండాలని భట్టి నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక కూడా ఇలా శాఖలవారీగానే నేతల పోరాటాలు కొనసాగుతాయని కూడా చెప్పడం విశేషం.
శ్రీధర్ బాబు, మల్లు భట్టి విక్రమార్క… ఈ ఇద్దరూ నిరుద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలపై శ్రద్ధ పెడతారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టాపిక్ ని జగ్గారెడ్డికి అప్పగించారు. ఇళ్ల స్థలాల వ్యవహారాలను కూడా ఆయనే కేటాయించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మున్సిపల్ శాఖ, నీటిపారుదల శాఖ, బెల్టు షాపులు, హైదరాబాద్ లో పబ్ లకు సంబంధించిన వ్యవహారాలను అప్పగించారు. సీతక్కకి విద్యా, గిరిజన సంక్షేమం అంశాలను అప్పగించారు. వీరయ్యకు గిరిజన విద్యను ఇచ్చారు. ఎవరికి కేటాయించిన అంశాలపై వారు అవగాహన పెంచుకోవాలనీ, చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని భట్టి సూచించారు. ఎవరి అంశాలపై వారు మాత్రమే మాట్లాడాలనీ, మిగతా నేతలు మద్దతుగా నిలవాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత… ఈ ఎమ్మెల్యేలు, వారికి కేటాయించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించాలని సీఎల్పీ నిర్ణయించింది. నెలకో నియోజక వర్గం చొప్పున ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక రాష్ట్రవ్యాప్త పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటిస్తారు.
సీఎల్పీ మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. నాయకుల మధ్య స్పష్టమైన పని విభజనను తీసుకొచ్చారు భట్టి. అంశాలవారీగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇది మంచి ప్రయత్నమే. అయితే, అమలులో ఎలా ఉంటుందో చూడాలి. దీంతోపాటు, కొంతమంది సీనియర్ నేతలు ఈ పని విభజనపై ఎలా స్పందిస్తారో అదీ చూడాలి! కీలకమైన అంశాలు మీద వారు మాత్రమే మాట్లాడాలి, ఇంకెవ్వరూ మాట్లాడకూడదు అంటే… సీనియర్ల మనోభావాలు ఎలా మారతాయో మరి? మేము ఏం చెయ్యాలని ప్రశ్న లేవనెత్తినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వ్యూహాన్ని అనుకున్నది అనుకున్నట్టు అమలు చేస్తే, కాంగ్రెస్ వాయిస్ ఈసారి అసెంబ్లీలో కొంత బలంగా వినిపించే అవకాశం ఉంటుంది.