మంత్రి కేటీఆర్ వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయన విమర్శలు ఏ రేంజిలో ఉంటాయో అందరూ చూస్తున్నదే. హుజూర్ నగర్ ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ మునిగిపోయే పడవనీ, అందుకే నాయకులెవ్వరూ అక్కడ ఉండేందుకు ఇష్టపడటం లేదనీ, హుజూర్ నగర్ సీటు కాంగ్రెస్ గెలిస్తే ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదనీ, అక్కడ సమస్యలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతవరకూ స్పందించిందే లేదని విమర్శలు చేశారు. వీటిపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అయితే, మమ్మల్ని చూసి ఎందుకు అంతగా భయపడుతున్నారు మీరు అంటూ కేటీఆర్ ని ప్రశ్నించారు భట్టి. ఆ భయమే లేకపోతే మా పార్టీ నుంచి 12 మంది శాసన సభ్యులను తీసుకునేవారు కాదన్నారు. ఇది మునిగే పడవ కాదనీ, ఎప్పటికైనా తెరాసను ముంచే పార్టీ అనీ, హుజూర్ నగర్ లో తాము గెలుస్తామనే భయం తెరాసలో కనిపిస్తోందన్నారు. ఆ భయం వెంటాడుతోంది కాబట్టే, మండలానికో మంత్రినీ ఊరికో శాసన సభ్యుడిని పంపించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేసే పని చేస్తున్నారని విమర్శించారు. మునిగే పడవ మాదో మీదో కొద్దిరోజుల్లో తెలుస్తుందన్నారు. ఇదే సమయంలో మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యాలను ప్రస్థావిస్తూ… తెరాస మునిగిపోవడానికి సిద్ధంగా ఉందని సీనియర్ నేత ఈటెల స్వయంగా చెప్పేశారన్నారు. మంత్రి పదవి ఎవరి దయాదాక్షిణ్యాలు కాదనీ, పార్టీకి ఓనర్లమని ఆయన చెప్పారన్నారు. ఓనర్లకీ, మీ పార్టీలోని కిరాయిదార్లకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఆందోళనలు తెరాసలో ఉన్నాయన్నారు. ముగిపోవడానికి సిద్ధంగా ఉన్న పడవలో ఇంకా కొనసాగుతావో, దూకి బయటకి వచ్చేస్తావో నువ్వే తేల్చుకోవాలని కేటీఆర్ ని ఉద్దేశించి చెప్పారు.
ఈటెల రాజేందర్ ఎపిసోడ్ ని కరెక్ట్ టైమ్ లో తెర మీదికి తెచ్చి విమర్శించారు భట్టి విక్రమార్క. ఎందుకంటే, తెరాస పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉందో ఆ మధ్య ఈటెల, షకీల్, రసమయి లాంటి నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించేశారు. నిజానికి, ఇది పార్టీకి బాగా నష్టం చేకూర్చే అంశం అవుతుందని అనుకున్నారు. వెంటనే, స్పందించేసి దిద్దుబాటు చర్యలు తీసేసుకున్నారు. అయితే, ఆ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ సరైన విమర్శనాస్త్రంగా ఇంతవరకూ వాడుకోలేకపోయింది. నిజానికి, తెరాసలో ఆ పరిస్థితిని కాంగ్రెస్ నేతలంతా సీరియస్ గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఉంటే… పొలిటికల్ గా మరింత మైలేజ్ వచ్చేది.