కాళేశ్వరంలోనూ రివర్స్ టెండర్లకు వెళ్లాలన్న డిమాండ్లు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కూడా మేఘా ఇంజినీరింగ్ కంపెనీనే చేపడుతూండటంతో… ఈ డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ మరింత సీరియస్ గా తీసుకుంది. పోలవరం హెడ్‌వర్క్స్, హైడల్ ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్‌లో.. 12.6 శాతం తక్కువకు.. పనులు చేసేందుకు మేఘా కంపెనీ ముందుకు వచ్చింది. దాంతో ప్రభుత్వానికి రూ. 800కోట్లు ఆదా అయ్యాయని..మంత్రులు ఘనంగా ప్రకటిస్తున్నారు. ఇది.. మేఘా కంపెనీ తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్ చేయాలన్న డిమాండ్లకు కారణం అవుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క… ఈ అంశాన్ని ఓ ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ ను జగన్ తో జరిగిన భేటీలో కేసీఆర్ స్వాగతించినట్లు జరిగిన ప్రచారంపై ఆయన స్పందించారు.
రివర్స్ టెండరింగ్‌ను కేసీఆర్ అభినందించడాన్ని స్వాగతిస్తున్నామని.. తెలంగాణలోనూ రివర్స్ టెండరింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో 12.6శాతం తక్కువకు మేఘా కంపెనీ టెండర్ వేసిందని .. తెలంగాణలోనూ జ్యుడిషియరీ కమిటీ వేసి టెండరింగ్ పర్యవేక్షణ జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల్లోనూ 12శాతం తక్కువకు టెండర్లు వేస్తారని.. దాని వల్ల మొత్తంగా రూ.34వేల కోట్లు ఆదా అవుతాయని… భట్టి విక్రమార్క విశ్లేషించారు. అలా కాకపోతే తెలంగాణలో టెండరింగ్ విధానంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ.. తెలంగాణలో అత్యతం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో సింహభాగం పనులు చేపట్టింది. పోలవరం ప్రాజెక్ట్ కు రివర్స్ టెండరింగ్ అతి తక్కువకు వేయడంతో.. ఇప్పుడు… తెలంగాణలోనూ దీనిపై చర్చ జరుగుతోంది. మేఘా కృష్ణారెడ్డికి తెలంగాణ సర్కార్ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం నేపధ్యంలో… రివర్స్ టెండరింగ్ కు వెళ్లే అవకాశం లేదు. కానీ ఎవరైనా కోర్టుకెళ్తే మాత్రం.. ఇబ్బందులు తలెత్తవత్తన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది.