తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేస్తామనే తెరాస ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం వివాదాస్పదంగా మారుతోంది. తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులపై వివాదం తీవ్రమవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. నిర్మాణం పూర్తికావచ్చిన ప్రాజెక్టును పట్టించుకోకుండా రీడిజైనింగ్ పేరుతో కొత్త వాటికి వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధపడ్డారని ఆరోపిస్తున్నాయి.
ఇప్పటికే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుకు మిగతా నిధులు ఇస్తే పూర్తవుతాయి కదా అనేది కాంగ్రెస్ ప్రశ్న. వాటిపి పట్టించుకోకపోవడం వల్ల 90 శాతం పనులు, వాటికి వెచ్చించిన నిధులు వృథా అవుతాయి. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ప్రభుత్వం రీ డిజైనింగ్ పేరుతో 2 లక్షల 20 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి సిద్ధపడుతోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
అవసరం లేకపోయినా రీడిజైనింగ్ ఎందుకనేది విపక్షాల ప్రశ్న. పైగా, ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టులకు మరోసారి ప్రారంభోత్సవం చేయడాన్ని కూడా విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. పాలమూరు జిల్లాలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ప్రాజెక్టును గతంలోనే ప్రారంభిచినట్టు భట్టి చెప్పారు. ప్రస్తుత మంత్రి హరీష్ రావు మళ్లీ నెట్టెంపాడు ప్రాజెక్టును ప్రారంభించడం వింతగా ఉందన్నారు.
ఖమ్మం జిల్లాలో సాగునీరు అందించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టును పూర్తి చేయాలనేది కాంగ్రెస్ డిమాండ్. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఆ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని భట్టి చెప్పారు. మరి ఈ పనులను పూర్తి చేయడానికి అడ్డంకి ఏమిటనే ప్రశ్నకు ప్రభుత్వమే జవాబు చెప్పాలి.