తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో లోపాలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు సీఎల్పీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క. ఎన్నికల సంఘం వైఫల్యంపై సుప్రీం కోర్టును ఆశ్రయించబోతున్నట్టు చెప్పారు. రాష్ట్రపతికి కూడా త్వరలోనే ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. ఈవీఎంలపై చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయనీ, వాటిని తొలగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఓటు హక్కు వినియోగించే ప్రతీ పౌరుడికీ ఎన్నికల ప్రక్రియ మీద అపనమ్మకం కలగకూడదనీ, ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
హామీల అమలుపై కేసీఆర్ సర్కారు తీవ్రమైన కాలయాపన చేస్తోందనీ, గత ఐదేళ్లలో వారు చేసిందేం లేదనీ భట్టి విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ ఐదేళ్లపాటు ఊరించారనీ, రెండోసారి గెలిచారు కాబట్టి ఇప్పుడైనా ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తారని ఆశిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేసేందుకు తాము పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి సంపూర్ణంగా ఖర్చుచేయడం లేదనీ, గత ఐదేళ్లలో నిధుల దుబారా జరిగిందనీ, పెద్ద ఎత్తున అవినీతి కూడా జరిగిందని ఆరోపించారు. ఆత్మగౌరవం కోసం ప్రశ్నిస్తే… బెదిరించే విధంగా కేసులు పెడుతూ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
ఎన్నికల నిర్వహణలో లోపాలనే టి. కాంగ్రెస్ పార్టీ ప్రథమ పోరాటాస్త్రంగా ఎంచుకున్నట్టుంది. అసెంబ్లీ ఎన్నికల్లోని కొంతమంది ఎన్నికపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఓ పది మందికిపైగా కాంగ్రెస్ నేతలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపులో అనుమానాలున్నాయనీ, వీవీ ప్యాట్లను లెక్కించే లేదనీ, అధికారులు అనుమతులు లేకుండా ఈవీఎమ్ లను నాయకులే తరలించిన ఘటనలున్నాయంటూ కేసులు దాఖలయ్యాయి. తాజాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా ఓ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. తనపై కేవలం 2 కేసులో ఉన్నాయంటూ ఎన్నికల సంఘానికి కేసీఆర్ సమాచారం ఇచ్చారనీ, కానీ ఆయనపై చాలా కేసులన్నాయనీ, ఆయన ఎన్నిక రద్దు చేయాలంటూ కూడా ఓ కేసు ఫైల్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికలను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు వేస్తున్న కేసులపై కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. తీర్పు తమకు అనుకూలంగానే ఉంటుందనీ, కాంగ్రెస్ కి అదొక మంచి ఊపు తెచ్చే అంశమౌతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సుప్రీం వరకూ ఈ కేసులు వెళ్తే… సర్వోన్నత న్యాయ స్థానం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.