దళిత బంధు పథకంపై టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అది ఓట్ల పథకం మాత్రమేనని మండిపడుతున్నారు. అయితే ఇతర కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ పథకం విషయంలో పెద్దగా విమర్శలు చేయడం లేదు. పైగా ముఖ్యమంత్రి నుంచి ఈ పథకం విషయంలో ఆహ్వానాలు వస్తే ఏ మాత్రం తడుముకోకుండా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. మొదటి సారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. మరోసారి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్ తాజాగా నాలుగు మండలాల్లో దళిత బంధును అమలు చేస్తున్నారు.
అందులో భట్టి విక్రమార్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఉంది. దీంతో వెళ్లాలా వద్దా .. అని తర్జన భర్జన పడిన భట్టి విక్రమార్క చివరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన ఇంటికి టీ కాంగ్రెస్ ముఖ్యుల్ని ఆహ్వానించి చర్చించారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గంగా పేరు పొందినవారంతా హాజరయ్యారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి కూడా వచ్చారు. అదే సమయంలో టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధుయాష్కీ కూడా వచ్చారు. ఇటీవల మధుయాష్కీ కోమటిరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు.. పోతే పో అన్నట్లుగా చాలెంజ్ చేశారు.
ఈ సమావేశంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ చివరికి భట్టి విక్రమార్క మాత్రం సీఎంతో సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ తరఫున డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే దళిత బంధు పథకమేపెద్ద మోసమని వాదిస్తున్న కాంగ్రెస్ .. ఆ పథకం అమలు విషయంలో జరుగుతున్న సమావేశా లకు వెళ్లడం ఎందుకన్న వాదన సహజంగానేవస్తుంది. ఈ గందరగోళాన్ని కాంగ్రెస్ నేతలే పెంచుకుంటున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.