కథానాయిక భావన పై జరిగిన ‘ఎటాక్’ చిన్నా చితకాదికాదు. నిజంగానే సభ్య సమాజం తలదించుకోవాల్సిన సంగతి అది. భావన పెను ప్రమాదం నుంచి తప్పించుకొంది కాబట్టి సరిపోయింది. లేదంటే దిల్లీలోని నిర్భయ కేసు కంటే భావనది ఏం తక్కువ..?? జరిగిన అన్యాయానికి భావన ఎంత కుమిలిపోయిందో అర్థమవుతూనే ఉంది. కానీ.. కన్నీటితో సరిపెట్టుకోలేదు. ‘నా బతుకు ఇంతే’ అనుకోలేదు. ధైర్యంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొంది. ఓ విధంగా చెప్పాలంటే.. భావన ఈ విషయంలో అందరి మనసుల్నీ గెలుచుకొంది. సాధారణంగా ఇలాంటి అకృత్యాలను మౌనంగానే భరిస్తుంటారు చాలామంది. అందులోనూ అమ్మాయిలు. చెబితే పరువు పోతుందన్న భయం. లేనిపోని తలనొప్పులు ఎందుకు అన్న సంశయం. కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఏం తిరుగుతామన్న అలసత్వం.. వీటికి మించి కెరీర్ ఏమూపోతుందో అన్న బెంగ. అయితే భావన ఇవన్నీ లెక్క చేయలేదు. డేర్ అండ్ డాషింగ్‌గా ముందుకు వచ్చింది. తనపై జరిగిన అకృత్యాన్ని చెప్పుకోగలిగింది.
ఇప్పుడు మరోసారి భావన ఖాతాలో మార్కులన్నీ పడిపోయాయి. జరిగిన సంగతులన్నీ పక్కన పెట్టి, సెట్లోకి అడుగుపెట్టేసింది భావన. తన తాజా చిత్రం యాడమ్ షూటింగ్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని విషపు ఘాటులాంటి ఘటన జరిగి వారం తిరక్క ముందే… ఎప్పటిలా తన పనుల్లో తాను పడిపోయింది. మలినమైంది భావన కాదు. తన వృత్తీ కాదు. ఆమెపై పడిన.. మృగాళ్ల మనసు. అలాంటప్పుడు భావన ఎందుకు దాక్కోవాలి. ఇంకా ఎందుకు కుమిలి కుమిలి ఏడ్వాలి? ‘దోషులకు శిక్ష విధించే వరకూ నేను ఇంటి గుమ్మం దాటను.. కెమెరా ముందుకు రాను’ అని భావన చెప్పుండొచ్చు గాక. కెమెరా ముందుకు రాకపోవడం వల్ల.. భావనకు కొత్తగా ఒరిగేదేం ఉండదు. తాను నమ్ముకొన్న వృత్తిని వదిలేయడం మినహా. అందుకే… గాయం మానకముందే, ఆ నొప్పి అనుభవిస్తూనే.. తన ప్రయాణాన్ని కొనసాగించడానికి ముందుకొచ్చింది. ఇంతకంటే స్ఫూర్తి మంత్రం ఇంకెక్కడ దొరుకుతుంది??