పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరగాల్సింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్మరణంతో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఈవెంట్ ని వాయిదా వేసింది చిత్ర బృందం. అయితే ట్రైలర్ మాత్రం బయటికి వచ్చింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’చిత్రానికి రీమేక్‌గా ‘భీమ్లానాయక్’ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు అనుగుణంగా ఈ సినిమాలో మార్పులు చేశారని చెప్పారు. అయితే ట్రైలర్ పెద్ద మార్పులు కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గటు కాస్త భారీగా తెరకెక్కించారు తప్పితే అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూలకథలో ఎలాంటి మార్పులు చేయలేదనే సంగతి ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.
పోలీష్ స్టేషన్ సీన్ తో మొదలైన ట్రైలర్ .. ఎలివేషన్లు, ఫైట్లతో ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ తో ముందుకు సాగింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ కథ ఇద్దరి మధ్య జరిగిన వార్. ట్రైలర్ లో కూడా భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ – డానియల్ శేఖర్ గా రానా వార్ కనిపించింది. అలాగే నిత్యామీనన్, రావు రమేష్, సముద్రఖని పాత్రలకు ట్రైలర్ లో చోటు దక్కింది. ‘ఒక వైల్డ్ యానిమల్ కి యూనిఫాం వేసి కంట్రోల్ లో పెట్టాం. నీవు ఆ యునిఫాం తీసేసావ్.”నేను ఇవతల ఉంటేనే చట్టం, అవతలకి వస్తే కష్టం. వాడికి” డైలాగ్స్ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. తమన్ అందించిన నేపధ్య సంగీతం గ్రాండ్ గా వుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.