అయ్యప్పయున్ కోషియమ్ రీమేక్ కి తెలుగులో ఎలాంటి పేరు పెడతారా? అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు. బలరామకృష్ణమూర్తి లాంటి పేర్లు బయటకు వచ్చాయి. చివరికి `భీమ్లా నాయక్`ని ఖాయం చేసేశారు. ఈ సినిమాలో పనవ్ పాత్ర పేరు భీమ్లా నాయక్. అందుకే అది ఫైనల్ అయ్యింది. ఇప్పుడు ఈ టైటిల్ రివీల్ చేస్తూ ఓ చిన్న పాటి టీజర్ కూడా విడుదల చేశారు. పవన్ కల్యాణ్ లుంగీ ఎత్తి మరీ.. శత్రు సంహారం చేస్తూ, ఆవేశంగా అడుగులు వేసుకుంటూ వచ్చే షాట్ ఇది.
డానీ… డానియల్ శేఖర్ – అని రానా తనని పరిచయం చేసుకుంటే
పవన్ – భీమ్లా.. భీమ్లా నాయక్ అంటూ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు.
`ఏంటి చూస్తున్నావ్.. క్యాప్షన్ లేదనా, అఖ్ఖర్లెద్దు.. పద బండెక్కు` అంటూ త్రివిక్రమ్ రేంజ్ పంచ్ ఒకటి పడింది. ఈ టీజర్ లో రానాని చూపించకపోవడం ఒక్కటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే… మలయాళంలో ఇదో మల్టీస్టారర్ రేంజ్ కథ. ఇద్దరు హీరోల పంతం ఈ కథ. రానా ఈ సినిమాలో మరో హీరో. వారిద్దరి మధ్య వైరమే ఈ కథకు బలం. అలాంటిది రానాని చూపించలేదు. అయ్యప్పయుమ్, కోషియమ్ అనేది ఇద్దరు హీరోల పేర్లని ప్రతిబింబించే టైటిల్. ఇక్కడ మాత్రం పవన్ పేరుని మాత్రమే టైటిల్ గా వాడారు. మరి కథలో ఇంకెన్ని మార్పులు చేర్పులూ వచ్చాయో..? మొత్తానికి పవన్ అభిమానులకు నచ్చేలా ఈ టీజర్ ని రూపొందించారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 2న ఈ సినిమాలోని తొలి గీతం బయటకు రానుంది.