రెండ్రోజుల క్రితం `భీమ్లా నాయక్` థియేటరికల్ ట్రైలర్ బయటకు వచ్చింది. ఫక్తు కమర్షియల్ గా కట్ చేసిన ట్రైలర్ అది. పవన్ – రానా పాత్రలు రెండూ పోటా పోటీగా ఢీ కొన్నప్పటికీ ఏదో ఓ అసంతృప్తి. పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచేశారు. ఆ సంగతి చిత్రబృందానికీ అర్థమైంది. ఇప్పుడు రెండో ట్రైలర్ ని దింపారు.
దాదాపు రెండు నిమిషాల ట్రైలర్ ఇది. పాత ట్రైలర్లో ఉన్న షాట్స్, డైలాగ్ చాలా వరకూ ఈ ట్రైలర్ లోనూ కనిపించాయి. అయితే టెంపో మారింది. ఆల్బమ్ లోని `లాలా… భీమ్లా` పాటని బ్యాక్ గ్రౌండ్ గా వాడుతూ… ట్రైలర్ కట్ చేశారు. పాత డైలాగులూ, షాట్లూ రిపీట్ అయినా… ఈ ట్రైలర్ చూశాక ఊపొచ్చింది.
“ఎవడాడూ.. ఏమైనా దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్.ఐ…“ అంటూ రానా అరవడం.. పవన్ ఎంట్రీ ఇవ్వడం కచ్చితంగా ఫ్యాన్స్ కి గూజ్బమ్స్ ఇచ్చే మూమెంట్సే. పాత ట్రైలర్ తో పోలిస్తే పవన్ ఎలివేషన్లు ఎక్కువగా కనిపించాయి. ఈసారి తమన్ కూడా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో శ్రద్ధ పెట్టాడనిపించింది.
“ఏయ్ రామస్వామి… రాయవయ్యా ఎఫ్.ఐ.ఆర్.. ఈడు బలిసి కొట్టుకుంటున్నాడు… మనమేంటో చూపిద్దాం“ అనే భీమ్లా నాయక్ డైలాగులో ఫైర్ కనిపించింది.
“నాయక్ పెళ్లాం అంటే నాయక్ లో సగం కాదు.. నాయక్ కి డబుల్“ అంటూ నిత్యమీనన్కీ మంచి డైలాగ్ ఇచ్చారు. బ్యాక్ గాల్లో ఎగరడం, రానా తప్పించుకోవడం, పవన్ గాల్లో ఎగిరి పిడి గుద్దులు విసరడం.. ఓహ్.. మంచి ఫ్లోలో సాగిపోయింది ట్రైలర్.
ఈ ట్రైలరే ముందు వదిలి ఉంటే… బాగుండేది అనిపించేలా ఉందీ కొత్త ట్రైలర్.