ఈ సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్ తప్పుకుంది. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ లకు చోటు కల్పిస్తూ… భీమ్లా నాయక్ సినిమాని వాయిదా వేశారు నిర్మాతలు. జనవరి 12న రావాల్సిన సినిమా ఇది. ఇప్పుడు.. ఫిబ్రవరి 25కి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ గిల్డ్ తరపున నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. మూడు సినిమాలకు థియేటర్లు కల్పించే అవకాశం లేదని, అందుకే భీమ్లా నాయక్ నిర్మాతల్ని, పవన్ కల్యాణ్నీ కలిసి ప్రొడ్యూసర్స్ గిల్డ్ పరిస్థితి వివరించిందని, వాళ్లు సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ లు పాన్ ఇండియా సినిమాలని, చాలా ఏళ్లుగా అవి నిర్మాణంలోనే ఉండిపోయాయని, వాటికి చోటు కల్పించాల్సిన అవసరం ఉందని దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 25న.. `ఎఫ్ 3` విడుదల కావాల్సివుంది. అయితే ఆ డేట్ ని `భీమ్లా నాయక్`కి త్యాగం చేశారు దిల్ రాజు. “శివరాత్రిన ఎఫ్ 3ని విడుదల చేద్దామనుకున్నాం. కానీ… ఇప్పుడు భీమ్లా నాయక్ కోసం.. ఎఫ్ 3ని వాయిదా వేశాం. ఏప్రిల్ 29న ఎఫ్ 3ని విడుదల చేస్తాం“ అని చెప్పారు.