పవన్ కల్యాణ్ పుట్టిన రోజుకు ఓ హుషారైన గిఫ్ట్ ఇచ్చింది `భీమ్లా నాయక్` టీమ్. ఈ సినిమా నుంచి తొలి పాట పవన్ పుట్టిన రోజున విడుదల చేస్తామని చిత్రబృందం ముందే చెప్పింది. అన్నట్టుగానే.. బర్త్ డే గిఫ్ట్ రూపంలో తొలి పాట వచ్చింది.
పవన్ లాంటి మాస్ హీరో నుంచి అభిమానులు ఏం కోరుకుంటారు. మంచి ఎలివేషన్లు… పూనకాలు తెప్పించే పాటలు. భీమ్లా నాయక్ తొలి పాటలో బోల్డన్ని ఎలివేషన్లు ఇప్పించుకునే ఛాన్స్ దొరికేసింది. పవన్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో ఈ పాటలో అలా చూపించేంత ఆస్కారం దొరికింది. పవన్ ని ఎత్తేసే పదాలు, తన క్యారెక్టర్ని అక్షరాలో చూపించే ప్రయత్నాలూ రామ జోగయ్య శాస్త్రి రాసిన పాటలో పుష్కలంగా కనిపించాయి. తమన్ ట్యూను, గాయకులతో పాడించిన విధానం.. వెరిసి భీమ్లా నాయక్ ఓపెనింగ్ అదిరిపోయింది.
ఆడాగాదు – ఈడాగాదు
అమీనోళ్ల మేడా గాదు
గుర్రం నీళ్లా గుట్టా కాడ
అలుగూ వాగు తాండాలోన – అంటూ ఓ సాకీతో ఈ పాట మొదలైంది.
ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ
ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్ద గుండా – అంటూ రెండే రెండు వాక్యాల్లో భీమ్లా నాయక్ క్యారెక్టరైజేషన్ చెప్పేశారు.
నిమ్మళంగ కనపడే నిప్పుకొండ – ముట్టుకుంటే తాటలేచిపొద్ది తప్పకుండా
ఇస్తిరి నలగని చొక్కా – పొగరుగ తిరిగే తిక్క
చెమడాలొలిచే లెక్కా – కొట్టాడంటే పక్కా… విరుగును బొక్కా
అంటూ ఓ ఫ్లోలో అలా అలా సాగిపోయింది.
ఎవ్వడైనా ఈడి ముందు గడ్డిపోస
ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస
నడిచే రూటే స్ట్రయిటు పలికే మాటే రైటు
టెంపరు మెంటు హాటు పవరుకి ఎత్తిన గేటు అంటూ అభిమానులకు నచ్చేలా, వాళ్లు మెచ్చేలా ఈ పాట సాగింది.
భీమ్.. భీమ్.. భీమ్.. భీమ్ భీమ్లా నాయక్. బుర్ర రాంకీర్తన పాడించే లాఠీ గాయక్.. అని రాయడంలో రామ జోగయ్య చమత్కారం కనిపించింది. మొత్తానికి… ఫ్యాన్స్కి మంచి ఊపు తీసుకొచ్చిన పాట ఇది. ఇంకొన్నాళ్లు ఈ పాట టాలీవుడ్ లో హల్ చల్ చేయడం ఖాయం.